Gold Rate: రానున్న రోజుల్లో మరింత పెరగనున్న బంగారం

by S Gopi |

ధరలు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Gold Rate: రానున్న రోజుల్లో మరింత పెరగనున్న బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: రానున్న రోజుల్లో బంగారం మరింత పెరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా టారిఫ్ వివాదం, సెంట్రల్ బ్యాంకు కొనుగొళ్ల కారణంగా పసిడికి గిరాకీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారంలో ధరలు సరికొత్త రికార్డులను అధిగమించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆభరణాల వ్యాపారులు యూకే, ఈయూ లాంటి ప్రధాన ఆర్థికవ్యవస్థల నుంచి విడుదల అయ్యే కీలక గణాంకాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అమెరికా ఫెడ్ అధికారుల నిర్ణయాల కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ర్యాలీ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి కొత్త గరిష్టాలను తాకుతున్నాయని ఏంజెల్ వన్‌కు చెందిన ప్రథమేష్ మాల్యా చెప్పారు. గత నెలాఖరులో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 98,079 వద్ద ఉండగా, గత వారాంతం రూ.1,03,420 వద్ద ఆల్‌టైం గరిష్టానికి చేరింది. ధరలు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదికూడా ధరలు కొత్త రికార్డులకు చేరేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం జూలై 30న 3,268 డాలర్ల నుంచి ఆగష్టు 8 నాటికి 3,534 డాలర్లకు చేరింది. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెంచుతున్న టారిఫ్ వార్ వల్ల బంగారం ధరలు ఔన్సుకు 3,800 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా కూడా వచ్చే మూడు నెలల్లో 10 గ్రాములు రూ. 1,10,000 వరకు వెళ్లే ఆస్కారం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Next Story