Gold Imports: మార్చిలో 192 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

by S Gopi |

దేశంలో గత నెల బంగారం దిగుమతులు ఏకంగా 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్ల(రూ. 38.16 వేల కోట్ల)కు చేరుకుంది

Gold Imports: మార్చిలో 192 శాతం పెరిగిన బంగారం దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు ఊహించని విధంగా కొత్త రికార్డులను దాటి దూసుకెళ్తున్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ ఏ మాత్రం తగ్గడంలేదు. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం.. దేశంలో గత నెల బంగారం దిగుమతులు ఏకంగా 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్ల(రూ. 38.16 వేల కోట్ల)కు చేరుకున్నాయి. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మార్చి మధ్య 27.27 శాతం వృద్ధితో 58 బిలియన్ డాలర్ల(రూ. 4.95 లక్షల కోట్ల) విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. అంతకుముందు 2023-24లో రూ. 3.88 లక్షల కోట్ల దిగుమతులు నమోదయ్యాయి. అంతర్జాతీయ నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఇటీవల పెరిగిన వాణిజ్య యుద్ధ భయాలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై పెట్టుబడిదారులు ఎక్కువ విశ్వాసం పెంచుకున్నారు. ఈ కారణంగానే బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి.

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 97,650 ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 89,450 ఉంది. వెండి కూడా కిలోప్ గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలకు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలే కారణం.

తగ్గిన వెండి

వెండి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 98,000 వద్ద ఉంది. ఇది దిగుమతుల్లో ప్రతిబింబించింది. మార్చి నెలలో వెండి దిగుమతుల విలువ 85.4 శాతం క్షీణించి 119.3 బిలియన్ డాలర్ల(రూ. 1,018 కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 11.23 శాతం తగ్గి రూ. 41.15 వేల కోట్లుగా నమోదయ్యాయి.

40 శాతం వాటాతో స్విట్జర్లాండ్ టాప్

బంగారం దిగుమతుల్లో అత్యధిక భాగం స్విట్జర్లాండ్ నుంచే వచ్చాయి. దాదాపు 40 శాతం వాటాతో ఆ దేశం ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత యూఏఈ(16 శాతం), దక్షిణాఫ్రికా(10 శాతం) ఉన్నాయి. భారత దిగుమతుల్లో బంగారం వాటా మాత్రమే 8 శాతం ఉంది. పరిమాణంలో చూస్తే గత ఆర్థిక సంవత్సరం మనం 757.15 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నాం. ఇది అంతకుముందు 2023-24లో తెచ్చుకున్న 795.32 టన్నుల కంటే తక్కువ. బంగారం దిగుమతులు పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు అత్యధికంగా ఉంది. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువ దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఆభరణాల పరిశ్రమ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

Next Story