తప్పుడు ప్రకటనలు.. ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-20 13:49:53  IST  )

దేశంలో రైడ్ హైలింగ్ సేవలందించే ర్యాపిడోకు (Rapido) కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ (CCPA) భారీ షాకిచ్చింది.

తప్పుడు ప్రకటనలు.. ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రైడ్ హైలింగ్ సేవలందించే ర్యాపిడోకు (Rapido) కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ (CCPA) భారీ షాకిచ్చింది. యూజర్లను ఆకర్షించేందుకు తప్పుడు ప్రకటనలు చేసినందుకుగానూ రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే, ఆ ప్రకటనల వల్ల ప్రభావితమైన వినియోగదారులకు కంపెనీ రీఫండ్ ఇవ్వాలని ఆదేశించింది. ర్యాపిడో గ్యారంటీడ్ ఆటో, 5 నిమిషాల్లో ఆటో మీ ముందు లేకపోతే రూ.50 రిఫండ్ ఇస్తాం అంటూ యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించింది. ఈ ప్రకటనలు 548 రోజులు 120కి పైగా నగరాల్లో వివిధ భాషలలో ప్రసారం అయ్యాయి. అయితే, రిఫండ్‌ను రాపిడో నేరుగా ఇవ్వకుండా రాపిడో కాయిన్స్ రూపంలో మాత్రమే ఇచ్చింది. అంతేకాకుండా ఇవి కేవలం బైక్ రైడ్స్‌కి మాత్రమే వర్తించేలా, అవి కూడా ఏడు రోజుల్లోనే వినియోగించేలా షరతులు పెట్టింది.

ఈ క్రమంలో ర్యాపిడోకు 2024 జూన్ నుంచి 2025 జులై మధ్యకాలంలో 1200పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా అధిక ధరల వసూలు, డబ్బు రీఫండ్ ఆలస్యం, డ్రైవర్ల దుర్వినయోగం, క్యాష్‌బ్యాక్ ఇచ్చే వాగ్దానాల ఉల్లంఘన వంటి అంశాలు ఉన్నాయి. వీటిలో సగం కూడా పరిష్కారం కాలేదు. దీనిపై విచారణ చేపట్టిన సీసీపీఏ ప్రజలకు వేగవంతమైన ఖచ్చితమైన సేవలు అందిస్తామంటూ ఈ యాడ్ ద్వారా ర్యాపిడో భావన కలిగించిందని కానీ దానిని నిలబెట్టుకోవటంలో విఫలమైందని గుర్తించింది. ఈమేరకు తాజాగా దీనిపై తీర్పు వెలువరిస్తూ ర్యాపిడో సంస్థ ముందుగా ప్రజలను మభ్యపెట్టే యాడ్ ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించింది. అలాగే కస్టమర్లకు రూ.50 క్యాష్ రీఫండ్ చెల్లించి దానికి సంబంధించిన రిపోర్టు 15 రోజుల్లో అందించాలని ఆదేశించింది.

Next Story