Elon Musk: అమెరికా స్టాక్ మార్కెట్ల దెబ్బకు భారీగా సంపదను కోల్పోతున్న బిలియనీర్లు

by S Gopi |   (  Updated:2025-03-11 15:00:23  IST  )

ఈ ఏడాది జనవరి 17 నుంచి ఎలన్ మస్క్ సంపద రూ. 12.9 లక్షల కోట్లు క్షీణించింది.

Elon Musk: అమెరికా స్టాక్ మార్కెట్ల దెబ్బకు భారీగా సంపదను కోల్పోతున్న బిలియనీర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపడుతున్న చర్యలతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా ప్రధాన సూచీ నాస్‌దాక్‌ గడిచిన నెల రోజుల వ్యవధిలో ఏకంగా 11 శాతం కుదేలైంది. కీలక టెక్‌ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి దెబ్బతిన్నాయి. టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఒక్క రోజులోనే 174 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.15 లక్షల కోట్లు) నష్టాలను ఎదుర్కొంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సైతం సోమవారం ఒక్కరోజే రూ. 2.52 లక్షల కోట్లను కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఈ ఏడాది జనవరి 17 నుంచి ఎలన్ మస్క్ సంపద రూ. 12.9 లక్షల కోట్లు క్షీణించింది. తాజాగా డోజ్ బాధ్యతలతో పాటు, టెస్లా సహా తన కంపెనీలను నిర్వహించడానికి తాను కష్టపడుతున్నానని, ఈ సమయంలో వ్యాపారాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందని ఎలోన్ మస్క్ అంగీకరించాడు. టెస్లా స్టాక్ రికార్డు స్థాయిలో పతనమైన నేపథ్యంలో ఫాక్స్ బిజినెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టెస్లా పైవ్యాఖ్యలు చేశారు. డొనాల్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ బిలియనీర్లు ఏకంగా 209 బిలియన్ డాలర్లు(రూ. 18.22 లక్షల కోట్లు) నష్టపోయారు.

ట్రంప్ ప్రభుత్వం విధానాల కారణంగా నెలకొన్న అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనపడటం లాంటి అంశాలు ఈ నష్టాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఎలన్ మస్క్ డోజ్, టెస్లా బాధ్యతలు ఏకకాలంలో నిర్వహించడం, టెస్లా అమ్మకాలు పడిపోవడం, జర్మనీలో ఆర్డర్లు 70 శాతానికి పైగా దెబ్బతినడం, చైనా నుంచి ఎగుమతులు 49 శాతం క్షీణించడంతో టెస్లా షేర్లు 2022 తర్వాత అత్యంత కనిష్టానికి చేరాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి 14 శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా రూ. 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రూ. 44 వేల కోట్లు, ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ రూ. 43.5 వేల కోట్లు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు రూ. 1.91 లక్షల కోట్ల నష్టాలను చూశారు.

Next Story