- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EMI Trap: రుణాల ఊబిలో సామాన్యుడు
85 శాతం మంది రుణగ్రహీతలు తమ నెలవారీ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకే చెల్లిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశంలో ఈజీ క్రెడిట్ సౌకర్యం చాలామందిని రుణాల ఊబిలోకి లాగేస్తోంది. ప్రధానంగా బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్), ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు, వ్యక్తిగత రుణాలు వేలాది మందిని దారుణమైన రుణ ఉచ్చులోకి నెట్టివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ తీసుకోవడం వెనుక చీకటి కోణాన్ని ఓ సర్వే బహిర్గతం చేసింది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీతల నుంచి ఈ వివరాలను సేకరించింది. ముఖ్యంగా రుణ ఎగవేతలు, చెక్ బౌన్స్, రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించిన అంశాలను సమీక్షించే ఈరిజల్యూషన్ కన్సల్టెన్సీకి చెందిన నిపుణుల ప్యానెల్ ఈ సర్వే నిర్వహించింది. 85 శాతం మంది రుణగ్రహీతలు తమ నెలవారీ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకే చెల్లిస్తున్నారు.
నెలకు రూ. 35,000 నుంచి రూ. 65,000 మధ్య సంపాదించే రుణగ్రహీతలు అందులో రూ. 28,000 నుంచి రూ. 52,000 వరకు ఈఎంఐల రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. మిగిలిన కొంత మొత్తం కూడా కిరాణా సామాగ్రి, కరెంటు బిల్లులు, పిల్లల విద్య, ఆరోగ్యం కోసం ఖర్చయిపోతోంది. దీనర్థం, ఎక్కువ మందికి తాము సంపాదించే దాంట్లో అప్పులు కట్టడానికే దాదాపు మొత్తం డబ్బు సరిపోతున్నది, రోజువారీ ఖర్చులకే చాలా ఇబ్బంది పడుతున్నారు.
అన్నీ ఖర్చులే
చాలామంది తమ ఆదాయంలో అప్పులు కట్టడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అందులో ప్రధానంగా,
క్రెడిట్ జగ్లింగ్: దాదాపు 40 శాతం మంది రుణగ్రహీతలు ఒక క్రెడిట్ కార్డును మరొక క్రెడిట్ కార్డు బకాయి చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది అత్యధిక వడ్డీ చెల్లించే అలవాటును ప్రోత్సహిస్తుంది. ఇదొక ప్రమాదకరమైన చక్రం. మరో 22 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం కోసం ఆశిస్తున్నారు. మరికొందరు స్థానిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
అవసరాలను తగ్గించుకోవడం: 65 శాతం మంది రుణగ్రహీతలు చాలావరకు అవసరాలను తగ్గించుకుంటున్నారు. అప్పులు కట్టేందుకు పిల్లలను విద్యకు దూరం చేయడం, వైద్య చికిత్సను వాయిదా వేయడం, బీమా పాలసీలను రద్దు చేయడం, సరైన ఆహారం కోసం చేసే ఖర్చులను తగ్గించడం వంటివి చేస్తున్నారు.
కొంతమంది రుణగ్రహీతలు (16 శాతం మంది) అడ్వాన్స్‌గా జీతం తీసుకుంటున్నారు, 15 శాతం మంది తమ వద్ద ఆస్తులను విక్రయిస్తున్నారు. అందులోనూ బంగారు ఆభరణాలు (8 శాతం), ఆస్తి (2 శాతం) అమ్మేస్తున్న వారున్నారు. ఇప్పటికే ఉన్న పెట్టుబడులను నగదుగా మార్చుకోవడం (5 శాతం) వంటి ప్రయత్నాలను కూడా చేస్తున్నారు.
అయితే, ఇలాంటి తాత్కాలిక పరిష్కారాలు 2-6 నెలల వరకు ఉపశమనం కల్పించినప్పటికీ, చాలామంది ఆ తర్వాత లోతుగా రుణ ఊబిలోకి దిగుతున్న పరిస్థితులను గమనించలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ అప్పు ఉంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సిందే, పైగా ఆస్తులను అమ్మడం అంటే భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు వారి వద్ద ఏమీ లేకుండా పోతుంది.
వేధింపులు, బెదిరింపులు
ఎప్పుడైతే రుణగ్రహీతలు రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవుతారో, రికవరీ ఏజెంట్లు ఈ వ్యవహారంలోకి అడుగుపెడతారు. ఈ సర్వేలో దీనికి సంబంధించి అనేక దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు వెల్లడయ్యాయి.
ఫోన్ రింగ్ ఆగదు: 72 శాతం రుణగ్రహీతలు రికవరీ ఏజెన్సీల వేధింపులకు గురవుతున్నట్టు చెబుతున్నారు. దాదాపు 67 శాతం మందికి తరచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సగటున నెలకు 50 నుంచి 100 కాల్స్ వస్తున్నాయంటున్నారు. రికవరీ ఏజెంట్ల నుంచి వచ్చే కాల్స్ కూడా ఉద్దేశపూర్వకంగా తెల్లవారుజామున (ఉదయం 6-8), రాత్రి 8-10 గంటలకు వస్తున్నాయని, అవి తమను ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నాయని రుణగ్రహీతలు పేర్కొంటున్నారు.
39 శాతం రుణగ్రహీతలు ఒకే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి ప్రతిరోజూ ఎక్కువ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. రికవరీ ఏజెంట్లు వాట్సాప్, ఎస్సెమ్మెస్‌లలో బెదిరింపు మెసేజ్‌లు కూడా పంపుతున్నారని 70 శాతం మంది చెప్పారు.
బెదిరింపులు, పరువు నష్టం: రికవరీ ఏజెంట్లు ఫోన్ కాల్స్‌తో మాత్రమే ఆగట్లేదు. కొందరు రుణగ్రహీతల ఇళ్లు, ఆఫీసులకు కూడా వెళ్తున్నారు. 18 శాతం కేసులలో, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు సహా కుటుంబ సభ్యులు కూడా రికవరీ ఏజెంట్ల బెదిరింపులను ఎదుర్కొవాల్సి వస్తోంది. దాదాపు 22 శాతం మంది ఏజెంట్లు తమ తల్లిదండ్రులకు కాల్ చేస్తున్నారని చెప్పారు. 12 శాతం రుణగ్రహీతలు ఏజెంట్లు తమ ఆఫీసులకు వస్తున్నారని, దానివల్ల తమ గౌరవానికి భంగం వాటిల్లుతోంది. ఫలితంగా అప్పు కట్టేందుకు ఆధారమైన ఉద్యోగంపైనే ప్రభావం పడుతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానసిక ఒత్తిడి
సామాన్యులకు అప్పు అనేది ఆర్థిక ఒత్తిడికి మించి, అతిపెద్ద నష్టం మానసిక ఒత్తిడి. పర్యవసానంగా, 50 శాతం కంటే ఎక్కువ మంది రుణగ్రహీతలు ఆందోళన, నిద్ర లేకపోవడం, నిరాశ, వైవాహిక జీవితంలో ఒత్తిడి, కుటుంబ సంఘర్షణ, ఉద్యోగంలో పనితీరుపై ప్రభావం, మరీ తీవ్రమైన సందర్భాల్లో ఆత్మహత్య ఆలోచనలు వంటి ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భాలున్నాయి.
కొంతమంది రుణగ్రహీతలు రికవరీ ఏజెంట్లు, సంస్థల నుంచి వచ్చే కాల్స్‌ను నివారించడం, ఫోన్ నంబర్‌లను మార్చడం లేదా వారి ఇళ్లను వదిలి వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. కానీ, వీటిలో ఏవీ సమస్యలకు పరిష్కారం కావు.
అవగాహనా లోపం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ద్వారా ఇలాంటి సమస్యలకు మార్గదర్శకాలు, రక్షణను ఏర్పాటు చేసింది. కానీ చాలామందికి రికవరీ ఏజెన్సీలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనే అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. చాలావరకు రికవరీ ఏజెంట్ల నుంచి వచ్చే వేధింపులు తరచుగా చట్టవిరుద్ధంగానే ఉంటున్నాయి. ఈ విషయంలో ఆర్‌బీఐ నిబంధనలు తమకు రక్షిస్తాయనే విషయం కూడా తెలియదని నిపుణుల ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా అన్నారు.
సూచనలు
ప్రస్తుతం వేధింపులను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల కోసం అత్యవసర జోక్యం, రుణగ్రహీతల కోసం రక్షణ వంటి వ్యవస్థాగత సంస్కరణలను సర్వే సిఫార్సు చేసింది.
రుణగ్రహీతలకు
* రుణ గ్రహీతలు తక్షణ రక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. రికవరీ ఏజెంట్లు ఎంతవరకు తమను సంప్రదించాలి, ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణగ్రహీతలకు ఉన్న హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలి.
* కాల్ లాగ్‌లను సేవ్ చేయడం, మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీయడం, వీలైతే కాల్స్‌ను రికార్డ్ చేయడం ద్వారా రికవరీ ఏజెంట్ల వేధింపులను డాక్యుమెంట్ చేయవచ్చు. ఏజెంట్లు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు.
వ్యవస్థాగత సంస్కరణలు
* ప్రజలు రుణాల ఉచ్చులలో పడకముందే బాధ్యతాయుతంగా రుణాలు తీసుకునే స్కూళ్లు, ఆఫీసుల్లో తప్పనిసరిగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించాలి.
* అధిక వడ్డీ వసూలు చేసే వారిని నియంత్రించే చర్యలు అవసరం. ముఖ్యంగా డిజిటల్ లోన్ యాప్‌లు తరచుగా అధిక రేట్లు వసూలు చేస్తాయి. రికవరీ ఏజెన్సీలకు తప్పనిసరి లైసెన్సింగ్, నిబంధన్లు ఉల్లంఘిస్తే కఠిన జరిమానాలు విధించాలి.
* నష్టపోయిన రుణగ్రహీతల కోసం సరైన పరిష్కారాలను అందించడానికి నిర్మాణాత్మక మార్గాలు రూపొందించాలి. అందుకు తగిన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి.
* చివరగా, ఆర్థిక దోపిడీ చేసే యాప్ ఆధారిత ఆర్థిక సంస్థలపై స్పష్టమైన నియంత్రణ పర్యవేక్షణ అవసరం.






