Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్.. రెండేళ్లలో రూ.2,500 కోట్లకు పైగా మోసం

by S Gopi |

డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో సైబర్ మోసగాళ్లు అధికారులుగా చెప్పుకుని బాధితులను నమ్మించి మోసం చేస్తున్నారు.

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్.. రెండేళ్లలో రూ.2,500 కోట్లకు పైగా మోసం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన రెండేళ్లలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా సామాన్యుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2,500 కోట్లకు పైగా దోచుకున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఈ సమయంలో వివిధ కేంద్ర సంస్థలు, ఆర్‌బీఐ ఇటువంటి స్కామ్‌లను అరికట్టేందుకు అనేక రకాల చర్యలు తీసుకున్నాయి. అయినప్పటికీ స్కామర్లు కొత్త మార్గాల్లో ప్రజల సోమ్మును దోపిడీ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో సైబర్ మోసగాళ్లు, పోలీసులు, సీబీఐ, ఆర్‌బీఐ వంటి కేంద్ర సంస్థలకు చెందిన అధికారులుగా చెప్పుకుని బాధితులను దర్యాప్తు పేరున నమ్మించి మోసం చేస్తున్నారు. వీడియో కాల్స్, అరెస్టు చేస్తామని బెదిరించి బాధితులను సురక్షిత ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయమని బలవంతం చేస్తారు. ఆ తరువాత ఆ సొమ్మును మ్యూల్ ఖాతాలకు వెళ్లిపోతాయి. నేరస్థులు ఈ-మెయిల్‌ లేదా మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా నకిలీ అరెస్ట్‌ వారెంట్లు, లీగల్‌ నోటీసులు ఇవ్వడం వల్ల బాధితులు మానసిక ఒత్తిడి, చట్టపరమైన భయాలతో వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చెప్పేస్తున్నారు.

క్రమంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు, తగ్గించేందుకు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, మోసాలకు సంబంధించిన వేలాది వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులను వాటి ఐటీ వ్యవస్థలలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ మానిటర్(ఎఫ్ఆర్ఐ)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు, రియల్-టైమ్ మోసాలను గుర్తించేందుకు, నిఘాను పెంచేందుకు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ)ను అభివృద్ధి చేస్తోంది.

Next Story