Credit Cards: ఫిబ్రవరిలో భారీగా తగ్గిన క్రెడిట్ కార్డు ఖర్చులు

by S Gopi |

పరీక్షల సమయం కావడం, కొత్త క్రెడిట్ కార్డుల జారీ కూడా గణనీయంగా తగ్గడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

Credit Cards: ఫిబ్రవరిలో భారీగా తగ్గిన క్రెడిట్ కార్డు ఖర్చులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారులు తక్కువగా ఖర్చు చేయడంతో క్రెడిట్ కార్డుల వ్యయం ఎనిమిది నెలల కనిష్ట స్థాయి రూ. 1.67 లక్షల కోట్లకు క్షీణించాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి. ప్రధానంగా పరీక్షల సమయం కావడం, కొత్త క్రెడిట్ కార్డుల జారీ కూడా గణనీయంగా తగ్గడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. జనవరిలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు మొత్తం 8.20 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయగా, ఫిబ్రవరిలో ఈ సంఖ్య 4.40 లక్షలకు పడిపోయింది. ఏడాది ప్రారంభంలో రెండు నెలలు భారత ఈక్విటీ మార్కెట్లలో అధిక నష్టాలు నమోదవడం కూడా క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలు తగ్గాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇది కనిపించింది. గతంలో స్టాక్ మార్కెట్ల లాభాలు క్రెడిట్ కార్డు వ్యయంలో కీలకపాత్ర పోషించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో తక్కువ కార్డులు ఇచ్చాయి. ఇది క్రెడిట్ కార్డుల వినియోగం క్షీణిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఫలితంగా ఫిబ్రవరి నాటికి వాడకంలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 10.93 కోట్లకు చేరింది. ఇది జనవరిలో ఉన్న 10.88 కోట్ల కంటే తక్కువ పెరుగుదల.

సమీక్షించిన నెలలో వినియోగదారుల ఖర్చు విషయంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు జనవరిలో రూ. 69,429.4 కోట్ల నుంచి ఫిబ్రవరిలో రూ. 62,124.91 కోట్లకు పడిపోయాయి. ఈ-కామర్స్ చెల్లింపుల్లోనూ ఇదే తరహా క్షీణత కనిపించింది. జనవరిలో రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.05 లక్షల కోట్లకు పడిపోయాయి. కార్డు జారీ చేసిన సంస్థలకు వినియోగదారులు చెల్లించాల్సిన అవుట్‌స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్ రూ. 2.9 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఈ విభాగంలో సమస్యలు ఉన్నప్పటికీ, క్రెడిట్ కార్డు పరిశ్రమ నెమ్మదిగానైనా వృద్ధి చెందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story