స్టాక్ మార్కెట్లలో ‘బ్లాక్ మండే’.. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం

by Kema Shiva Kumar |

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు పతనం కాగా, రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది.

స్టాక్ మార్కెట్లలో ‘బ్లాక్ మండే’.. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: వారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (NIFTY) సైతం 200 పాయింట్లకు పైగా పతనమై కీలక స్థాయిల దిగువన ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది.

రూపాయి రికార్డు పతనం..

స్టాక్ మార్కెట్ల పతనానికి తోడు రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ ఏకంగా 145 పైసలు క్షీణించింది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.96 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమే రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచింది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.

Next Story