Election Results: పొలిటికల్ సర్‌ప్రైజ్‌లు

by S Gopi |

కొందరు అభ్యర్థుల విజయాలు, ఓటములపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Election Results: పొలిటికల్ సర్‌ప్రైజ్‌లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంతో ఉత్కంఠగా సాగిన సోమవారం నాటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొందరు అభ్యర్థుల విజయాలు, ఓటములపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆధీనంలో ఉన్న పానిహటి నియోజకవర్గంలో, బీజేపీ అభ్యర్థి రత్న దేవ్‌నాథ్ 28,836 ఓట్ల భారీ మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. 13 రౌండ్ల లెక్కింపు అనంతరం ఆమె 87,977 ఓట్లు పొందగా, టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ 59,141 ఓట్లకే పరిమితమయ్యారు. సీపీఐ(ఎం) అభ్యర్థి కలతన్ దాస్‌గుప్తా చాలా వెనుకబడ్డారు. దశాబ్ద కాలంగా టీఎంసీ ఆధిపత్యంలో ఉన్న ఈ సీటులో వచ్చిన ఈ ఫలితం, ఓటర్ల మూడ్‌లో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. ఈ విజయంలో రాజకీయ అంశాలతో పాటు బలమైన భావోద్వేగ కోణం కూడా ఉంది. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ ఘటనలో బాధితురాలి తల్లిగా, రత్న దేవ్‌నాథ్ తన వ్యక్తిగత విషాదాన్ని ప్రజా చర్చగా నిలిపారు. 'ఈ ఎన్నిక కేవలం ఓట్ల గురించి కాదు, ఇది న్యాయం కోసం పోరాటం' అని ఆమె చెప్పిన మాటలు ప్రచారానికి కేంద్రబిందువయ్యాయి. మహిళల భద్రత, న్యాయం, జవాబుదారీతనం వంటి అంశాలు ఈ ఎన్నికలో ప్రధాన అజెండాగా మారాయి.

అలాగే, తమిళనాడులో డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్​ ఓటమిని ఎదుర్కొన్నారు. కొళత్తూర్‌ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడారు. 1996 తర్వాత స్టాలిన్‌ తొలిసారిగా ఓడినట్టు సమాచారం. స్టాలిన్‌ను ఓడించిన టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు 82,997 ఓట్లతో 8795 ఓట్ల మెజారిటీని సాధించారు. స్టాలిన్ 74,202 ఓట్లకు పరిమితమయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్​, మైలాపూర్‌ స్థానంలో టీవీకే అభ్యర్థి వెంకటరమణన్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. వెంకటరమణన్‌కు 70,070 ఓట్లు రాగా, 28,972 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. తమిళిసై 32,328 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. టీవీకే చీఫ్ విజయ్ డ్రైవర్ కుమారుడు శబరీనాథన్ విరుగుంబాక్కం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై 27,086 ఓట్ల మెజారిటీతో గెలుపు దక్కించుకున్నారు.

మరో కీలక రాష్ట్రమైన అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి 23,182 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Next Story