Anil Ambani: మనీలాండరింగ్ వ్యవహారంలో అనిల్ అంబానీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

by S Gopi |

అభియోగాలు ఎదుర్కొంటున్న 50కి పైగా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసి రికార్డులను పరిశీలించారు.

Anil Ambani: మనీలాండరింగ్ వ్యవహారంలో అనిల్ అంబానీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ, ముంబైలలోని ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 50కి పైగా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసి రికార్డులను పరిశీలించారు. 25 మందికి పైగా వ్యక్తులను కూడా ప్రశ్నించారు. దాదాపు 35 చోట్ల దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించాయి. ఈడీ ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేయడానికి ప్రణాళికాబద్ధమైన, వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తేలింది. 2017-2018 మధ్య యెస్ బ్యాంకు నుంచి తీసుకున్న సుమారు రూ. 3,000 కోట్ల రుణాలను అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు అనుమానాస్పద పద్ధతిలో తరలించాయి. దీనికోసం యెస్ బ్యాంకు మాజీ ప్రమోటర్లతో సహా సీనియర్ బ్యాంక్ అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

వెరిఫై చేయని ఆర్థిక లావాదేవీలు కలిగిన కంపెనీలకు రుణాలు ఇవ్వడం, వివిధ రుణగ్రహీత సంస్థలలో సాధారణ డైరెక్టర్లు, చిరునామాలను ఉపయోగించడం, మంజూరు ఫైళ్లలో అవసరమైన డాక్యుమెంటేషన్ లేకపోవడం, షెల్ సంస్థలకు నిధులను మళ్లించడం, అప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి కొత్త రుణాలు ఇచ్చిన సందర్భాలను ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ అక్రమ రుణాలను సులభతరం చేయడంలో సీనియర్ యెస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రమోటర్ల ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌ అథారిటీ, బ్యాంక్‌ ఆఫ్ బరోడాతో సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థలు తమ వద్ద ఉన్న సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

Next Story