- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mukesh Ambani: జియో ఏర్పాటు జీవితంలో తీసుకున్న 'అతిపెద్ద రిస్క్': ముఖేష్ అంబానీ
భారత్ అత్యంత అధునాతన డిజిటల్ టెక్నాలజీకి సిద్ధంగా లేదని, జియో విడుదల ఆర్థికంగా సరైన నిర్ణయం కాకపోవచ్చని కొందరు సూచించారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారత టెలికాం రంగాన్ని 2016లో వచ్చిన రిలయన్స్ జియో ఒక్కసారిగా కుదిపేసింది. అప్పటిదాకా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక కంపెనీలు మూతబడ్డాయి. వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలపై ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే, రిలయన్స్ జియో ఏర్పాటు వ్యక్తిగతంగానే కాకుండా.. తన వ్యాపార జీవితంలోనే 'అతిపెద్ద రిస్క్' అని సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అంటున్నారు. చాలామంది నిపుణులు, వాటాదారులు జియో ఒక ఆర్థిక వైఫల్యం కావొచ్చని హెచ్చరించారు. అయితే, అప్పుడు తాను తీసుకున్న రిస్క్ భారత్‌ను డిజిటల్ దేశంగా మార్చడంలో పోషించిన పాత్ర ఎంతో విలువైనదని అన్నారు. తాజాగా మెకిన్సే అండ్ కోతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబానీ.. భారత్ అత్యంత అధునాతన డిజిటల్ టెక్నాలజీకి సిద్ధంగా లేదని, జియో విడుదల ఆర్థికంగా సరైన నిర్ణయం కాకపోవచ్చని కొందరు సూచించారు. అయితే, దేశీయంగా 4జీ మొబైల్ నెట్‌వర్క్ కోసం సొంత డబ్బును వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పారు. ఒకవేళ మీరన్నట్టే జియో ఫెయిల్ అయినా, పెట్టిన కోట్లాది పెట్టుబడి లాభాలివ్వకపోయినా పర్లేదని చెప్పాను. అలాంటి పరిస్థితి ఎదురైతే రిలయన్స్ చేసిన అత్యుత్తమ దాతృత్వం అవుతుందన్నారు. కానీ జియో విజయవంతం కావ్డంతో భారత్‌ను డిజిటలైజ్ చేయగలిగాం, తద్వారా దేశాన్ని మార్చగలిగామని ముఖేష్ అంబానీ వెల్లడించారు.
నమ్మకంతో చేసిన అతిపెద్ద జూదం
ఈ సందర్భంగా తన తండ్రి, వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ మాటలను గుర్తుచేసుకున్న ముఖేష్ అంబానీ, 'రిలయన్స్ ఒక ప్రక్రియ. ఇది శాశ్వతంగా ఉండాల్సిన సంస్థ. రిలయన్స్ మిమ్మల్ని, నన్ను మించి ఎదిగేలా చూసుకోవాలని ' చెప్పారన్నారు. ఆ మాటలే సంస్థ పట్ల తనకున్న నిబద్ధత అని పేర్కొన్నారు. 2016 నుంచి జియో ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరలో డేటాను అందించడం ద్వారా భారత టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గించేలా చేసింది. పరిశ్రమ వర్గాల ప్రకారం, రిలయన్స్ జియో అనేది ముఖేష్ అంబానీ మాస్ మార్కెట్ అయిన భారత ప్రజలపై నమ్మకంతో చేసిన అతిపెద్ద జూదం. ఎలాంటి టెస్టింగ్ ప్రక్రియ లేకుండా మార్కెట్‌లోకి 25 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లకు పైగా) పెట్టుబడిని పెట్టారు. అందులో ఎక్కువ భాగం ఆయన సొంత డబ్బే. ఈరోజు రిలయన్స్ జియో వాల్యుయేషన్ ప్రారంభ పెట్టుబడికి దాదాపు ఐదు రెట్లు చేరుకుందని అంచనా.
వందేళ్లయినా దేశానికి సేవ చేస్తాం
2027లో రిలయన్స్ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటుంది. కానీ, 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారత్‌తో పాటు మానవాళికి సేవ చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాం. అది సాధ్యమవుతుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. 1960, 70ల నాటి రిలయన్స్, 2000, 2020ల నాటి రిలయన్స్ పూర్తి భిన్నమైన సంస్థ. ఎందుకంటే ప్రపంచ ప్రతి ఐదు పదేళ్లకొకసారి మారుతుంది. ఆ మార్పు అప్పటిదాకా వ్యాపారంలో నేర్చుకున్న పాఠాలకు పూర్తీ భిన్నంగా ఉంటుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.






