Amazon Pay: 8 శాతం వడ్డీతో ఎఫ్‌డీ సేవలు ప్రారంభించిన అమెజాన్ పే

by S Gopi |

ఇప్పుడు అమెజాన్ పే పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెడుతూ, ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లో ఇన్వెస్ట్ చేసే సేవలను ప్రారంభించింది.

Amazon Pay: 8 శాతం వడ్డీతో ఎఫ్‌డీ సేవలు ప్రారంభించిన అమెజాన్ పే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియాకు చెందిన అమెజాన్ పే గురించి యూజర్లకు ప్రధానంగా లావాదేవీలు, బిల్లులు చెల్లించే ఒక యూపీఐ సర్వీస్‌గా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అమెజాన్ పే పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెడుతూ, ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లో ఇన్వెస్ట్ చేసే సేవలను ప్రారంభించింది. దీనికోసం కంపెనీ పలు ఆర్థిక సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా అమెజాన్ కస్టమర్లు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్‌బీలు), బ్యాంకులకు చెందిన ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ సదుపాయం ప్రధానంగా, ఆయా సంస్థల్లో ప్రత్యేకంగా పొదుపు ఖాతా తెరవకుండానే ఇన్వెస్ట్ చేసే వీలు కల్పిస్తుంది. సులభంగా అమెజాన్ పే యాప్ నుంచే ఎఫ్‌డీ చేసుకోవచ్చు. వాటిపై 8 శాతం అధిక వడ్డీ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. రూ. 1,000 నుంచి ఎంత మొత్తమైనా ఎఫ్‌డీ చేసుకోవచ్చు. దీనికోసం అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థల్లో శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్లైస్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు అన్ని సంస్థలు అదనంగా 0.5 శాతం ఆఫర్ చేయగా, శ్రీరామ్ ఫైనాన్స్ మహిళలకు అదనంగా 0.5 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఈ ఎఫ్‌డీలపై ప్రతి డిపాజిటర్‌కు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) కింద అందించే రూ. 5 లక్షల బీమా హామీ లభిస్తుందని అమెజాన్ పే స్పష్టం చేసింది. అదనపు పత్రాలు లేకుండా డిజిటల్ పద్దతిలో ఈ ఎఫ్‌డీలో మదుపు సదుపాయం కల్పిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

Next Story