Akshaya Tritiya: అక్షయ తృతీయకు రూ. 20 వేల కోట్ల వ్యాపారం

by S Gopi |

ధరలు 60 శాతానికి పైగా పెరిగినప్పటికీ, ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు గత ఏడాది స్థాయిలోనే 15–20 టన్నుల మేర స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.

Akshaya Tritiya: అక్షయ తృతీయకు రూ. 20 వేల కోట్ల వ్యాపారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా దేశీయ ఆభరణాల వ్యాపారం రూ.20,000 కోట్లుగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేసింది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, ప్రజలు తక్కువ పరిమాణంలో అయినా సరే కొనేందుకు ముందుకొచ్చారని సీఏఐటీ అభిప్రాయపడింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ధరలు 60 శాతానికి పైగా పెరిగినప్పటికీ, ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు గత ఏడాది స్థాయిలోనే 15–20 టన్నుల మేర స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. గతేడాది అక్షయ తృతీయ సందర్భంగా రూ.16,000 ఆభరణాల వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరల ప్రభావాన్ని అధిగమించేందుకు, నగల వ్యాపారులు తయారీ ఛార్జీలను తగ్గించి, వినియోగదారులను ఆకర్షించడానికి ప్రమోషన్స్ నిర్వహించారు. నెల రోజుల క్రితం 10 గ్రాములకు సుమారు రూ. 1.7 లక్షల ఆల్-టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఇటీవల దాదాపు 10 శాతం దిగొచ్చింది. ఈ ధరలు తగ్గడం కూడా బంగారు ఆభరణాలు, నాణేలకు డిమాండ్‌ పెరిగేందుకు సహాయపడింది.

ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ (జీజేసీ) ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ, ఈ ఏడాది డిమాండ్ 'సంతృప్తికరంగా' ఉందన్నారు. ఆదివారం ఉదయం నుంచి దక్షిణాదిలో డిమాండ్ అధికంగా ఉందన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాయంత్రం 4 గంటల తర్వాత దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది, ఇది డిమాండ్‌లో లేట్ పిక్-అప్ ధోరణి ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే, గతేడాది అక్షయ తృతీయ సమయంలో డిజైన్‌ను బట్టి 13-20 శాతం వరకు తయారీ ఛార్జీలను ఈ ఏడాది ఆభరణాల వ్యాపారులు ఈ సీజన్‌లో 7–13 శాతానికి తగ్గించినట్లు రోక్డే తెలిపారు. దీనివల్ల అమ్మకాలకు ప్రోత్సాహం లభించిందని పేర్కొన్నారు.

Next Story