Airtel: రూ.189 ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపేసిన ఎయిర్‌టెల్

by S Gopi |

ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ కనిపించడంలేదు.

Airtel: రూ.189 ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపేసిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం రంగంలో చౌకైన ప్లాన్‌లను తొలగించే పరంపర ఇంకా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగ టెలికాం భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో తీసుకొచ్చిన రూ. 189 ఎంట్రీ-లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించినట్టు సమాచారం. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ కనిపించడంలేదు. ఈ ప్లాన్ ప్రధానంగా వాయిస్ కాల్స్ కోసం, తక్కువ డేటాతో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను నిలిపివేయడం వల్ల కాల్స్ కోసం మాత్రమే సెకండరీ సిమ్‌లో దీన్ని ఉపయోగిస్తున్న వారికి ఖర్చులు పెరగనున్నాయి. ఇప్పుడు రూ. 199తో కనీస రీఛార్జ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే, ప్రజలు ఎక్కువ డేటాను ఉపయోగించుకునేలా మొబైల్ కంపెనీలు చౌకైన ప్లాన్‌లను తొలగిస్తున్నాయని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు తరచుగా ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటానికి వీలవుతుంది. ప్రస్తుతం అందిస్తున్న ఉచిత, అపరిమిత 5జీ డేటాను పరిమితం చేయాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, వినియోగదారులు మునుపటిలా ఇంటర్నెట్‌ వాడకాన్ని కొనసాగించడానికి ఖరీదైన డేటా ప్లాన్‌లను కొనుగోలు చేయాల్సి రావొచ్చు.

Next Story