Mythos: ఏఐ ముప్పు.. బ్యాంకింగ్ రంగానికి కొత్త అలారం

by S Gopi |

ఇప్పటివరకు బ్యాంకులు మొండి బకాయిలు, ద్రవ్య లభ్యత ఒత్తిడి, మార్కెట్ అస్థిరత వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

Mythos: ఏఐ ముప్పు.. బ్యాంకింగ్ రంగానికి కొత్త అలారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల తలెత్తుతున్న ప్రమాదాల గురించి దిగ్గజ బ్యాంకు అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమస్యను బ్యాంకింగ్ రంగం చాలాకాలం నుంచే ఎదుర్కొంటోంది. కానీ ఈ సమావేశం ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఇప్పటివరకు బ్యాంకులు మొండి బకాయిలు, ద్రవ్య లభ్యత ఒత్తిడి, మార్కెట్ అస్థిరత వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పుడు కొత్త ప్రమాదాలు వేగంగా ముందుకు వచ్చాయి. అవే, ఏఐ ఆధారిత మోసాలు, సైబర్ దాడులు, ఐడెంటిటీ మోసం. దీంతో ఈ సమావేశం సాధారణ చర్చ కాదని స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బ్యాంకులను హెచ్చరించిన తీరు తీవ్రంగా ఉంది. సమస్యను తక్షణమే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే, ఏఐ దాడులు సాంప్రదాయ భద్రతా వ్యవస్థల కంటే వేగంగా పనిచేస్తున్నాయి.

దీనంతటికీ కారణం, ఆంత్రోపిక్ కొత్తగా అభివృద్ధి చేసిన 'మైథోస్' అనే అధునాతన ఏఐ మోడల్. ప్రస్తుతం ఈ టూల్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు అత్యాధునిక టెక్ వ్యవస్థలలోని లోపాలను గుర్తిస్తుంది, సైబర్ దాడులను ఆటోమేట్ చేస్తుంది, మోసాలను వేగంగా జరిగేలా చేస్తుంది. ఈ అంశాలే కొత్త ఏఐ టూల్స్ మోసగాళ్ల చేతుల్లో పడితే ఏమవుతుందనే కీలక ప్రశ్న లేవనెత్తాయి. ఈ క్రమంలో మైథోస్ టెక్ ప్రపంచంలో సృష్టిస్తున్న ప్రకంపనలు, ప్రభుత్వం అత్యవసరంగా దీనిపై ఎందుకు దృష్టి సారించింది? బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో ఉందా? ఆర్థిక ప్రభావం? వంటి విషయాల గురించి తెలుసుకుందాం..!

మైథోస్ ఎంత మేరకు ప్రమాదకరమో తెలియకపోయినప్పటికీ, బ్యాంకులు చాలా వేగంగా డిజిటల్ వినియోగం పెంచుతున్నాయి. ఇదే సమయంలో పెరుగుతున్న డిజిటల్ ముప్పునూ ఎదుర్కొంటున్నాయి. బ్యాంకులు ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లుగా మారాయి. లక్షల లావాదేవీలను నిర్వహిస్తూ, 24 గంటలు మొబైల్ యాప్‌లను, అత్యంత సున్నితమైన కస్టమర్ డేటాను నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యక్తులు, వ్యాపారుల చెల్లింపులకు సహకారం అందిస్తున్నాయి. ఈ క్రమంలో, సైబర్ రిస్క్ ఇప్పుడు సాధారణ ఐటీ సమస్య కాదు, ప్రధాన బిజినెస్ రిస్క్‌గా మారింది.

ఈ ముప్పు ఎంత తీవ్రంగా మారగలదో అర్థం చేసుకోవడానికి, ఏఐ వల్ల బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి నిపుణులు చెబుతున్న విషయాలను తెలుసుకోవాలి.

ఏఐ యుగంలో మోసాలు

సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. ఏఐ వృద్ధి కారణంగా సైబర్‌దాడుల స్వభావం మారిందని ఏఐ-ఆధారిత సైబర్‌సెక్యూరిటీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబల్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ బీను అరోరా చెప్పారు. సైబర్ దాడులు గతంలో 'మాన్యువల్‌గా లేదా అడపాదడపా' జరిగేవి, ఇప్పుడు ఆటోమేటెడ్‌గా, విస్తృత స్థాయిలో, గుర్తించడం మరింత కష్టమైందన్నారు.

ఏఐ ఉపయోగించి ఉన్నతాధికారుల గొంతు, వీడియో నకిలీ చేయడం, ఉద్యోగులను మోసం చేసే డీప్‌ఫేక్ పద్ధతులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారంతో మెసేజ్‌లు, నిజమైన కమ్యూనికేషన్‌ అనిపించేలా చేసే హైపర్-పర్సనలైజ్డ్ ఫిషింగ్, నిజమైన, నకిలీ డేటాతో కొత్త ఐడెంటిటీ, నకిలీ కేవైసీతో కూడిన సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయి.

వేగంగా ఏఐ దాడులు

కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టూల్స్ రియల్ టైమ్‌లో సిస్టమ్‌లోని భద్రతా లోపాలను గుర్తిస్తాయి, తద్వారా తక్కువ సమయంలో సైబర్ మోసగాళ్లు దాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా జరిగే దాడులపై నివారణ చర్యలు తీసుకునేలోపే నిమిషాల్లో, లేదా సెకన్లలోనే మోసాల వల్ల కలిగే నష్టాలు పెరిగిపోవచ్చు.

పాత భద్రతా వ్యవస్థలు సరిపోతున్నాయా?

ఇలాంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ భవిష్యత్తు బ్యాంకింగ్ రంగంలో నెలకొనే ఆర్థిక నష్టాలపై మారుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుందని జడ్జ్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ కనిష్క్ అగర్వాల్ అన్నారు. ఆర్థిక నేరాలకు ఇప్పుడు ఏఐ టూల్స్ కొత్త సాధనంగా మారాయి. కానీ, బ్యాంకులు మాత్రం ఇప్పటికీ, ఓటీపీలు, వాయిస్ అథెంటికేషన్, బిహేవియరల్ అనలిటిక్స్ వంటి పద్దతులను అనుసరిస్తున్నాయి. డీప్‌ఫేక్ వాయిస్‌, ఏఐ టెక్నాలజీ నకిలీ ఐడెంటిటీని వాడుతోంది, మరీ ముఖ్యంగా వ్యక్తుల గుర్తింపునే డూప్లికేట్ చేయగల స్థాయికి ఏఐ వచ్చింది.

ఆర్థిక ప్రభావం

ఏఐ-ఆధారిత మోసాల వల్ల బ్యాంకులకు ఎక్కువ నిధుల కేటాయింపు, లాభాలపై ఒత్తిడి, ఖాతాదారుల డిపాజిట్లలో నష్టం కలగడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. సైబర్ మోసాలు కొనసాగితే పెద్ద ఎత్తున డిపాజిట్లు బయటకు తరలిపోవడం వల్ల కూడా కొన్ని బ్యాంకులకు ద్రవ్య లభ్యత కష్టంగా మారుతుంది.

ఏం చేయాలి

ఈ పరిణామాలు ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ అనేది కేవలం ఐటీకి సంబంధించిన సమస్యగా కాకుండా, బ్యాంకు బోర్డులకు ఆర్థిక ప్రాధాన్యతగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం సైబర్ దాడుల స్థాయిలోనే ఏఐ ఆధారిత రక్షణలు కూడా ఉండాలి. రియల్ టైమ్ మానిటరింగ్, అన్ని బ్యాంకులు పరస్పరం సమాచారం పంచుకోవాలి, ఏఐని ఒక టూల్‌గా కాకుండా, సిస్టమ్‌లో భాగంగా చూడాలని సూచిస్తున్నారు.

Next Story