ఏఐతో సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లు తప్పవు: శక్తికాంత దాస్

by Dishanational1 |
ఏఐతో సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లు తప్పవు: శక్తికాంత దాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కారణంగా సైబర్ సెక్యూరిటీ సవాళ్లు అనేక రెట్లు పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వినియోగదారుల సంచారాన్ని రక్షించేందుకు ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ వార్షిక సదస్సులో మాట్లాడిన దాస్, నియంత్రణ సంస్థ ఆర్థిక లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు, నిర్వహణ కార్యకలాపాలకు కోశాగారంగా పనిచేస్తుందని చెప్పారు. దీనివల్ల పటిష్టమైన డేటా విశ్లేషణ ద్వారా వినియోగదారుల సేవలను మెరుగుపరిచేందుకు ఒక అవకాశమని ఆయన తెలిపారు. డేటా అనలిటిక్స్‌ని ఉపయోగించడం ద్వారా కస్టమర్ అవసరాలను ముందుగానే అంచనా వేయగలమని, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.

మోసపూరిత లావాదేవీల పెరుగుతున్న ఈ సమయంలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, అటువంటి మోసాలను గుర్తించడానికి టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించి మూలాలను విశ్లేషించడంపై దృష్టి సారిస్తే అలాంటి ఫిర్యాదులు పదేపదే రాకుండా నిరోధించవచ్చు. కానీ ఏఐ రావడంతో సైబర్ సెక్యూరిటీ సవాళ్లు అనేక రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని దాస్ అభిప్రాయపడ్డారు. అవి వినియోగదారుల నమ్మకాన్ని ప్రభావితం చేసేలా వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం, మోసానికి గురవ్వొచ్చు. కాబట్టి కస్టమర్ల సమాచారాన్ని రక్షించేందుకు ఆర్థిక సంస్థలు గణనీయమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించేలా చూడాలని దాస్ సూచించారు.


Next Story