- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: అదానీ షేర్ల పతనం.. రూ. 1.4 లక్షల కోట్ల నష్టం
ఎస్ఈసీ గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీలకు నేరుగా ఈ-మెయిల్ ద్వారా సమన్లు జారీ చేయాలని కోర్టు అనుమతి కోరడంతో అదానీ గ్రూప్ షేర్లు 14 శాతం వరకు క్షీణించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం భారీగా నష్టాలను చూశాయి. ఇందుకు ప్రధానంగా అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీలకు నేరుగా ఈ-మెయిల్ ద్వారా సమన్లు జారీ చేయాలని కోర్టు అనుమతి కోరడంతో అదానీ గ్రూప్ షేర్లు 14 శాతం వరకు క్షీణించాయి. ఇదివరకు ఎస్ఈసీ నుంచి సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, మనదేశం వాటిని తిరస్కరించింది. అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అధికారులు, పలువురు నేతలకు లంచాలు ఇచ్చారని, దీనికి అమెరికాకు చెందిన నిధులను ఉపయోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, వీటిని అసత్య ఆరోపణలుగా అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెయిల్ ద్వారా సమన్లు ఇచ్చేందుకు ఎస్ఈసీ అనుమతులు కోరడంతో కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఒక్కర్ రోజులోనే రూ. 1.4 లక్షల కోట్లు క్షీణించి దాదాపు రూ. 12.2 లక్షల కోట్లకు చేరుకుంది. గ్రూప్‌లోని అదానీ గ్రీన్ షేర్ 14 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 11 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 7 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అంబుజా సిమెంట్ 5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 6 శాతం, ఎన్‌డీటీవీ 4.50 శాతం, ఏసీసీ 3 శాతం మేర దెబ్బతిన్నాయి.
స్టాక్ మార్కెట్ల పతనం
మరోవైపు, అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ అంశాల కారణంగా శుక్రవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. దీనికి ప్రధానంగా అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కొనసాగడం, భారత కరెన్సీ రూపాయి మరింత క్షీణించడం, ఈక్విటీ మార్కెట్లలో మదుపు విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు సిద్ధపడటం వంటి అంశాలు భారీ నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 769.67 పాయింట్లు కుదేలై 81,537 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్లు క్షీణించి 25,048 వద్ద ముగిశాయి. ఫలితంగా వారాంతం ఒక్కరోజే మదుపర్లు రూ. 6 లక్షల కోట్లను నష్టపోగా, బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 452 లక్షల కోట్లకు చేరింది.
రూపాయి మరింత కనిష్టం
విదేశీ నిధుల అమ్మకాల ఒత్తిడి, ప్రపంచ మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ మధ్య, శుక్రవారం రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 92కి పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని రూ. 91.87 వద్ద స్థిరపడింది. బలహీనమైన దేశీయ మార్కెట్లు, కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా భారత రూపాయి మరింత క్షీణిస్తోంది. వీటికి తోడు ముడి చమురు ధరల పెరుగుదల, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్‌లో వచ్చిన పెరుగుదల రూపాయిపై ఒత్తిడి పెంచాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.






