Adani Group: హెలికాప్టర్ తయారీలోకి అదానీ గ్రూప్

by S Gopi |

ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Adani Group: హెలికాప్టర్ తయారీలోకి అదానీ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కొత్తగా హెలికాప్టర్ల తయారీలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. దేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇటాలియన్ దిగ్గజం లియోనార్డో మంగళవారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించాయి. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇటీవలే అదానీ గ్రూప్ విమానాల తయారీ కోసం బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేయర్ కంపెనీతో జతకట్టిన సంగతి తెలిసిందే. 'మేక్ ఇన్ ఇండియా' ప్రయత్నాలకు, దేశాన్ని మరింత స్వయం సమృద్ధిగా మార్చడానికి ఈ ఒప్పందం సహకరిస్తుంది. ఈ భాగస్వామ్యం భారత సాయుధ దళాల అవసరాలను, ముఖ్యంగా లియోనార్డో అధునాతన ఏడబ్ల్యూ169ఎం, ఏడబ్ల్యూ109 ట్రెక్కర్ఎమ్ హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా దశల వారీగా స్థానిక తయారీ మాత్రమే కాకుండా నిర్వహణ, రిపేర్లు, మెయింటెనెన్స్, ఓవర్‌హాలింగ్ సామర్థ్యం, పైలట్ల ట్రెయినింగ్ లాంటి ఈ ఒప్పందంలో భాగంగా జరుగుతాయని అదానీ గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో హెలికాప్టర్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 250 కంటే తక్కువ హెలికాప్టర్లు ఉండటంతో ఈ రంగంలో వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్‌వంశీ చెప్పారు. రాబోయే పదేళ్లలో ఏడాదికి 100 హెలికాప్టర్ల అవసరం ఉంటుందని ఆయన అంచనా వేశారు.

Next Story