Financial Changes: జూన్ 1 నుంచి జరగబోయే ఆర్థిక మార్పులివే

by S Gopi |

వాటిలో సేవింగ్స్, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, పీఎఫ్ యాక్సెస్ లాంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

Financial Changes: జూన్ 1 నుంచి జరగబోయే ఆర్థిక మార్పులివే
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో 24 గంటలు గడిస్తే ఈ ఏడాది ఇంకొక నెల చరిత్రలో కలిసిపోనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి కొత్తగా రాబోయే ఆర్థికపరమైన మార్పుల గురించి తెలుసుకోవాలి. వాటిలో సేవింగ్స్, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, పీఎఫ్ యాక్సెస్ లాంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ఈపీఎఫ్ఓ 3.0

జూన్ 1 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అప్‌గ్రేడ్ చేసిన ఈపీఎఫ్ఓ ​​3.0ను ప్రారంభించనుంది. ఇది కొత్త నెలలో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి. ఈ అప్‌గ్రేడ్ ద్వారా యూపీఐ, ఏటీఎం నుంచి విత్‌డ్రా వంటి సదుపాయాలు, క్లెయిమ్‌ ప్రక్రియ వేగవంతం అవనున్నాయి.

ఎఫ్‌డీ రేట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను తగ్గించిన తర్వాత వివిధ బ్యాంకులు కూడా అందుకనుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ తగ్గించాయి. ఇదే బాటలో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థిర డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించనుంది. జూన్ 1 నుంచి రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీని 4-8.4 శాతం వరకు వడ్డీని సవరించింది. అత్యధిక రేటు 30-36 నెలల మధ్య కాలపరిమితికి ఇవ్వనుంది. ముఖ్యంగా, ఐదేళ్ల కాలానికి 60 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.6 శాతం నుంచి 8 శాతానికి తగ్గుతుంది.

క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు

జూన్ 20 నుంచి యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ విషయంలో దశలవారీ కీలక మార్పులను తీసుకురానుంది. అందులో యుటిలిటీ, టెలికాం, అద్దె, ఇంధన, వాలెట్‌, ఇన్సూరెన్స్‌, ఎడ్యుకేషన్‌ వంటి లావాదేవీలపై ప్రయోజనాలను నిలిపేయనుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లను తగ్గించింది. జూన్‌ 1 నుంచి యుటిలిటీస్‌, అద్దె, ఇంధనం, వాలెట్‌, ఎడ్యుకేషన్‌, ఇన్సూరెన్స్‌, గవర్నమెంట్ బిల్లులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు రివార్డు ప్రయోజనాలను ఆపేయనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా జూన్ 10 నుంచి టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్‌ కార్డు హోల్డర్ల లాంజ్‌ యాక్సెస్‌కు సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.50 వేలకు పైన కొనుగోలు చేసిన వారికే లాంజ్‌ యాక్సెస్‌ లభిస్తుంది.

మ్యూచువల్ ఫండ్‌లకు సెబీ కొత్త నిబంధనలు

మ్యూచువల్ ఫండ్ల రంగంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్స్‌కు కటాఫ్ సమయాలలో మార్పులు తీసుకు రానుంది. ఆఫ్‌లైన్ లావాదేవీలకు మధ్యాహ్నం 3 గంటలకు, ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయం ముగిసిన తర్వాత ఏదైనా ఆర్డర్ చేస్తే తర్వాతి వర్కింగ్ డేకు ప్రాసెస్ చేస్తారు.

ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువు

ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ జూన్ 14. ఈ తేదీ నాటికి గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైన వారు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అప్‌డేట్‌ల కోసం రూ. 25 లేదా ఆధార్ కేంద్రాలలో రూ. 50 రుసుము చెల్లించాలి.

Next Story