బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అభ్యంతరాల వెల్లువ.. వద్దంటూ వేలాది ఫిర్యాదులు

by  |
Bullet train project
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్ సహకారంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అభ్యంతరాలు వెల్లువలా వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలు నిర్మాణంపై స్వయంగా ఆయన సొంత రాష్ట్రంలోనే 1,908 మంది రైతులు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ అసెంబ్లీ వేదికగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.

అహ్మదాబాద్-ముంబైల (508 కిలోమీటర్ల దూరం) మధ్య నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు 2017లో శ్రీకారం చుట్టారు. 2023 వరకు దీనిని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ మేరకు పనుల బాధ్యతను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్)కు అప్పగించారు. అయితే గడువు సమీపిస్తున్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో కూడా మొదటి దశ భూసేకరణ వివిధ దశల్లో ఉంది. ఇక మహారాష్ట్రలోని రెండు జిల్లాల మీదుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంది. కానీ 2019లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్న ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా సర్కారు ఈ ప్రాజెక్టుకు అడ్డు పుల్లలు వేస్తున్నది.

ఇక గుజరాత్‌లోని ఎనిమిది జిల్లాల నుంచి వెళ్తున్న బుల్లెట్ రైలు వల్ల తమకు నష్టం చేకూరుతుందని 1908 మంది రైతులు ఫిర్యాదు చేసినట్టు బీజేపీ అసెంబ్లీలో తెలిపింది. అత్యధికంగా సూరత్ నుంచి 940 ఫిర్యాదులు అందగా, భరూచ్ (408), వల్సాడ్ (236), నవసరి (201) జిల్లాల రైతులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు పోరాటం చేస్తున్నప్పటికీ తొలిదశ భూసేకరణ పూర్తి కానుందని బీజేపీ ప్రకటించడం గమనార్హం. ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో దాదాపు 90 శాతం కంటే ఎక్కువే సేకరించామని విజయ్ రూపానీ సర్కారు తెలిపింది.

Next Story

Most Viewed