ఉద్యోగం రాదేమోనని.. ఉసురు తీసుకున్న యువకుడు

by  |
ఉద్యోగం రాదేమోనని.. ఉసురు తీసుకున్న యువకుడు
X

దిశ, నల్లగొండ: ఉద్యోగం వచ్చాకే ఇంటికి వస్తానని తల్లిదండ్రలతో చెప్పి వెళ్లిన యువకుడు, ఇక తాను జీవితంలో స్థిరపడనేమోనని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన ఊట్కూరి రాములుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రాహుల్ ఉన్నారు. రాహుల్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డీఎమ్మెల్టీ విద్యనభ్యసిస్తూ, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన స్వగ్రామం ఖాజీరామారానికి వెళ్లాడు.

తన పేదరికంలో ఉన్న తల్లిదండ్రులను చూసి, ఉద్యోగం వచ్చిన తర్వాతే ఇంటికి వస్తానని చెప్పి నల్లగొండకు వచ్చాడు. ఎన్ని రోజులు చదివినా తనకు ఉద్యోగం రాదనే మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం తమ మిత్రులు వచ్చి తలుపులు తీసి చూడగా రాహుల్(20) ఉరేసుకుని ఉన్నాడు. వెంటనే ఖాజీరామారంలో ఉన్న తన తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. రాహుల్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ పోలీసులు తెలిపారు.

Next Story