పోలీస్ స్టేషన్ లోనే రక్తం కారేలా తన్నుకున్నారు.. ఇక్కడ ఇది కామనేనంటా!

by  |
GodhavariKhani
X

దిశ, గోదావరిఖని: వరుస ఘటనలతో ఈ మధ్య కాలంలో ఓ పోలీస్ స్టేషన్ వివాదాలకు నిలయంగా మారుతోంది. గతంలో ఇలాగే పోలీస్ స్టేషన్ లో ఘర్షణ జరగడంతో కొంతమంది సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అయితే వివాదాస్పదమవుతున్న పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ లో కొందరు అంటే కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని ఒకరిద్దరు ఓ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మరో వ్యక్తి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్లితే… గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ మధ్యకాలంలో కేసుల రాజీలో నడుస్తున్న పంచాయితీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ కేసులు రాజీ చేయడంలో కొందరు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చిట్టీల పేరుతో ఉడాయించిన ఓ వ్యక్తి కేసు విషయంలో స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి నిత్యం పోలీస్ స్టేషన్ కు వచ్చే కేసులను రాజీ చేసే దిశలో వారి దగ్గరనుండి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిఖని గాంధీ నగర్ కు చెందిన యువతికి జమ్మికుంట ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బాధితురాలు ఆమె తండ్రి జులై 18వ తేదీన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇరువర్గాలను పిలిపించిన సీఐ రమేష్ బాబు కొద్దిసేపు మాట్లాడి అనంతరం బయట మాట్లాడుకుని రండి అంటూ సూచించడంతో బయటికి వెళ్లినవారు పోలీస్ స్టేషన్ ముందే ఘర్షణపడ్డారు. దీంట్లో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఒక వర్గం పక్షాన పెద్ద మనుషులుగా రాగా వారితో సైతం ఘర్షణకు దిగారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంతమందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు, సెటిల్మెంట్ల పేరుతో కొందరు దందాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటనను సీరియస్ గా తీసుకొని కొద్ది మంది సిబ్బంది పై వేటు వేశారు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం పోలీసుల సాక్షిగా ఇరువర్గాలు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ లో అందరు చూస్తుండగానే రక్తం కారే విధంగా కొట్టుకున్నారు.

గణేష్ నగర్ కు చెందిన అసరి రాజుకు ద్వారకనగర్ కు చెందిన దాక్షాయణికి ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు రోజుల క్రితం కుమారుడు జన్మించగా ఆస్పత్రి వద్ద భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ బయట మాట్లాడుకోవాలని సూచించారు. బయటకు వచ్చిన ఇరువర్గాలు పోలీసుల ముందే రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో రమేష్, అజయ్ అనే వ్యక్తులు గాయపడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఫిర్యాదు కోసం వచ్చిన బాధితులు పరుగులు తీశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే కొంతమందికి సంబంధించిన పాపాల చిట్టా బయట పడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed