లాక్‌డౌన్‌లో క్రికెటర్లు.. కన్నేసిన బుకీలు !

by  |
లాక్‌డౌన్‌లో క్రికెటర్లు.. కన్నేసిన బుకీలు !
X

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలన్నీ ఆగిపోయాయి. కౌంటీ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు అన్నీ వాయిదా పడటంతో ఆటగాళ్లు ఇండ్లకే పరిమితం కాగా, చాలా మంది క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన బుకీలు.. క్రికెటర్లతో బేరసారాల కోసం రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న క్రికెటర్లను అభిమానుల పేరుతో పరిచయం చేసుకొని.. వారితో చాటింగ్ చేస్తూ మెల్లగా ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. ‘ప్రస్తుతం క్రీడలన్నీ నిలిచిపోయాయి.. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులు వాయిదా పడ్డాయి. దీంతో క్రికెటర్లతో సంబంధాలు పెంచుకోవడానికి బుకీలకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారని’ అలెక్స్ మార్షల్ చెబుతున్నారు. భవిష్యత్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఆటగాళ్లను మచ్చిక చేసుకుంటున్నారని.. వారికి తాయిళాల ఎర వేస్తున్నారని అలెక్స్ చెబుతున్నారు. అయితే, ఆటగాళ్లకు ప్రమాదకరమైన పరిస్థితులతో పాటు బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారో అవగాహన ఉందని.. దానికి దూరంగానే ఉంటున్నట్లు మార్షల్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరు ఆటగాళ్లను బుకీలు సంప్రదించారని.. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా తెలియజేశారని మార్షల్ చెప్పారు.

కాగా, బుకీల వ్యవహారంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్ అజిత్ సింగ్ స్పందించారు. భారత ఆటగాళ్లు బుకీల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని అన్నారు. బుకీలు ఎవరైనా తమను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే బోర్డుకు తెలియజేయాలని క్రికెటర్లకు సూచించినట్లు ఆయన తెలిపారు. బుకీలు అభిమానులుగా మాటలు కలిపి.. అవినీతి వరకు తీసుకెళ్తారని ఆయన చెప్పారు. ఇదే విషయంపై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి స్పందించారు. తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని.. అవినీతి ప్రలోభాలకు లొంగరని ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్లు కూడా వాయిదా పడటంతో బెట్టింగ్ మాఫియాకు భారీ నష్టాలు వస్తున్నాయని.. పలు మార్గాల ద్వారా ఐపీఎల్ పునరుద్దరణకు.. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిర్వహించేలా బీసీసీఐతో లాబీయింగ్ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఆరోపణలను బీసీసీఐ అధికారి ఒకరు కొట్టిపారేశారు. బుకీలు ఎవరి ద్వారానైనా బోర్డును ప్రలోభపరచలేరని.. ఇది ఏక వ్యక్తితో నడిచేది కాదని.. దీనికి ఒక కమిటీ, అసోసియేషన్లు ఉన్నాయని చెప్పారు.

Tags : BCCI, ICC, Bookies, social platform, betting mafia

Next Story

Most Viewed