వివాదాస్పదంగా మారిన బోనకల్ ఏఈ తీరు

by Dishafeatures2 |
వివాదాస్పదంగా మారిన బోనకల్ ఏఈ తీరు
X

దిశ, వైరా : వైరా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం పరిధిలోని విద్యుత్ అధికారుల తీరు " నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు" అన్న చందంగా తయారైంది. అక్రమ వసూళ్ల కోసం అధికారులు విద్యుత్తు వినియోగదారులను వేధిస్తున్న తీరు ఎన్పీడీసీఎల్ సంస్థకు తీవ్ర అపకీర్తిని తెచ్చి పెడుతుంది. ఈ సబ్ డివిజన్లోని బోనకల్ ఏఈ గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు విద్యుత్ వినియోగదాల నుంచి ఏకంగా 20 రూపాయల బాండ్ పేపర్లపై భవిష్యత్తులో మీటర్లు అడగమని సంతకాలు పెడితేనే ప్రస్తుతం మీటర్లు మంజూరు చేస్తామని బెదిరించడం విశేషం.

బాండ్ పేపర్ రాయకుంటే మీటర్లు ఇచ్చే ప్రసక్తే లేదట

బోనకల్ కు చెందిన విద్యుత్ వినియోగదారుడు నిమ్మల రాజశేఖర్ ఒక్కో మీటర్ కు వన్ కిలో వాట్ లోడుతో రెండు మీటర్ల కోసం ఫిబ్రవరి మొదటి వారంలో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు మీటర్లు మంజూరు చేయకుండా ఏడీఏ రామకృష్ణ గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పటివరకు పదిసార్లు ఏడిఏ రామకృష్ణను మీటర్ల కోసం రాజశేఖర్ కలిసినా ఫలితం లేకుండా పోయింది. గతం రెండు నెలల క్రితమే రాజశేఖర్ ఉండే ప్రాంతంలోనే అధికారులు మూడు విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. కాని రాజశేఖర్ కు ఉద్దేశపూర్వకంగా విద్యుత్ మీటర్ మంజూరు చేయకుండా అధికారులు వేధిస్తున్నారు. దీంతో విసిగి వేశారని రాజశేఖర్ ఏడిఏ నిర్లక్ష్యపు తీరుపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావుకు శనివారం ఫిర్యాదు చేశారు. అయితే శనివారం సాయంత్రం బోనకల్ ఏఈ ఉమామహేశ్వరరావు రాజశేఖర్ విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రేకుల షెడ్డు భవనాల వద్దకు వెళ్లి హల్ చల్ చేశారు. భవిష్యత్తులో విద్యుత్ మీటర్లు అడగమని 20 రూపాయలు బాండ్ పేపర్ పై లిఖితపూర్వక వాంగ్మూలం రాసిస్తేనే ప్రస్తుతం రెండు మీటర్లు మంజూరు చేస్తామని ఏ ఈ హుకుం జారీ చేశారు. అందుకు విద్యుత్ వినియోగదారుడు రాజశేఖర్ నిరాకరించాడు.

కేవలం ఇబ్బందులు పెట్టి నగదు వసూలు చేసేందుకే ఏఈ విద్యుత్తు వినియోదారులను ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తున్నారని బోనకల్ వాసులు పేర్కొంటున్నారు. గతంలో బోనకల్ లోని ఖమ్మం రోడ్ లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే ఓ కాంప్లెక్స్ కు ఏకంగా ఇదే ఏడిఏ 22 మీటర్లు నిబంధనలకు విరుద్ధం గా మంజూరు చేశారు. బోనకల్ లో అనేక ప్రాంతాల్లో ఇష్టానుసారంగా కాంప్లెక్స్ లకు మీటర్లు మంజూరు చేసిన అధికారులకు వన్ కిలో వాట్ తో విద్యుత్ మీటర్లకు అప్లై చేసిన వారికి మాత్రం విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా బాండ్ల పేర్లతో బెదిరించటం విద్యుత్ శాఖ పరువును బజారుపాలు చేస్తుంది. ఏఈ అక్రమ వసూళ్ల కోసమే బాండు రాయాలని బెదిరింపులు పాల్పడ్డారని బోనకల్ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందించి వైరా ఏడిఏ కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారిస్తారో.... ఇదంతా వైరా కార్యాలయానికి "మామూలే"నని వదిలేస్తారో వేచి చూడాల్సిందే. ఈ విషయమై బోనకల్ ఏఈ ఉమామహేశ్వరరావును దిశ వివరణ కోరగా తాను 20 రూపాయలు బాండ్ పేపర్ రాయమన్నది వాస్తవమేనని అంగీకరించాడు. వైరా ఏడిఏ రామకృష్ణ ఆదేశాలతోనే విద్యుత్ వినియోగదారుడు రాజశేఖర్ ను బాండ్ పేపర్ రాయమన్నానని స్పష్టం చేశారు.

Next Story