మన్యంలో మావోయిస్టుల బాంబు కలకలం.. యువకుడికి గాయాలు

by  |
మన్యంలో మావోయిస్టుల బాంబు కలకలం.. యువకుడికి గాయాలు
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టులు పోస్టర్లు వేసిన చోట అమర్చిన బాంబు ఏజెన్సీలో కలకలం రేపింది. పోస్టర్లు తొలగించడానికి వచ్చే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు పోస్టర్ అంటించిన చెట్టు క్రింద బాంబు అమర్చినట్లు భావిస్తున్నారు. పోస్టర్‌లో ఏముందో అని చదవడానికి వెళ్ళిన ఆలం బ్రహ్మనాయుడు అనే యువకుడు గాయపడ్డాడు. అతడికి చర్లలో ప్రాథమిక వైద్యం చేయించి భద్రాచలం తరలించారు. అతడికి ప్రాణహాని లేనప్పటికీ బాంబు పేలుడు వల్ల కంటిలో గాజు ముక్కలు దిగినట్లుగా అనుమానిస్తూ కంటి వైద్యం చేస్తున్నట్లుగా సమాచారం.

బాంబు స్క్వాడ్ తనిఖీలు

నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కాలం వెళ్ళదీస్తున్న చర్లలో ఈ ఘటన ఉలిక్కిపాటుకి గురిచేసింది. క్షణాల్లో చర్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. మావోయిస్టు పోస్టర్లు వెలిసిన మామిడితోటలో అణువణువు గాలించినట్లు సమాచారం. పోలీసులు నిత్యం కూంబింగ్‌కి వెళ్ళివచ్చే రహదారి కావడంతో.. మామిడితోట మొదలుకొని సమీప లెనిన్‌కాలనీ ఊరి చివర వరకు బాంబు స్క్వాడ్ బృందం రోడ్డువెంట తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మావోయిస్టుల చర్యపై భయాందోళనలు

పోస్టర్ల వద్ద మావోయిస్టులు బాంబు పెట్టడంపై ఏజెన్సీ వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు పడినప్పుడు అందరికంటే ముందు ఫొటోలు, వీడియోలు తీసి పాఠకులకు సమాచారం చేరవేయాలని పాత్రికేయులు పరుగులు తీస్తుంటారు. మావోయిస్టులు వేసిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల్లో మ్యాటర్ ఏముందో అని చదవడానికి స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతారు. అలాంటి చోట్ల మావోయిస్టులు బాంబులు పెట్టడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.

అమాయకపు గిరిజనులే మావోయిస్టుల లక్ష్యమా ?: ఎస్‌పి సునీల్‌దత్

ఏజెన్సీలో అమాయక గిరిజనులే లక్ష్యంగా మావోయిస్టులు దాడులు చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి సునీల్‌దత్ ఆరోపించారు. చర్లలో మందుపాతర పేలుడు ఘటనపై ఆయన స్పందించారు. కాలకృత్యాల కోసం వెళుతున్న ఆలెం బ్రహ్మనాయుడు(30) అనే యువకుడు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరల వల్లన గతంలో కూడా చాలామంది అమాయకపు ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరికొందరు తమ అవయవాలను పోగొట్టుకుని విగత జీవులుగా జీవిస్తున్నారని తెలిపారు.


Next Story