టీఎన్జీఓని ఇలా టార్గెట్ చేసిన బీజేపీ

by  |
టీఎన్జీఓని ఇలా టార్గెట్ చేసిన బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పలు పార్టీలకు ఉద్యోగ సంఘాలు టార్గెట్ అయ్యాయి. ప్రస్తుతం టీఎన్జీఓను బీజేపీ టార్గెట్ చేసింది. అయినప్పటికీ టీఎన్జీఓ కూడా వెనకడుగు వేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భార‌త్ బంద్‌కు మద్దతుగా నిలబడుతోంది. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆయా ఉద్యోగవర్గాలు భార‌త్ బంద్‌కు మద్దతుగా నిలిచాయి. అటువైపు బీజేపీ కూడా టీఎన్జీఓ నేతలపైనే గురి పెట్టింది. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ కూడా బీజేపీలోనే ఉండటంతో ఆ పార్టీకి కొంత కలిసి వస్తోంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మాటల యుద్దం మొదలైంది.

రైతులకు అండగా ఉంటే తప్పేంటి..?

ఉద్యోగ సంఘాల్లో పెద్ద యూనియ‌న్‌గా పేరొందిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం తరపున భార‌త్ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ముందస్తుగానే ఇలాంటి వ్యతిరేక ప్రకటనలను ఊహించిన టీఎన్జీఓ… జేఏసీ తరుపున కాకుండా కేవలం యూనియన్ కే పరిమితమైంది. వాస్తవంగా జేఏసీ ఛైర్మన్ గా కూడా టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. దీంతో జేఏసీ నుంచి మద్దతు ఉంటుందని భావించారు. కానీ భార‌త్ బంద్‌కు టీఎన్జీఓ మాత్రమే మద్దతు తెలిపింది.

అయితే దీనిపై ఆయా పార్టీలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీఎన్జీఓ కూడా దూకుడుగానే సమాధానమిస్తోంది. రైతులకు సంబంధించిన విషయమని, ఇది కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా విమర్శల ధోరణితోనే ఉంటామని టీఎన్జీఓ స్పష్టం చేస్తోంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో రైతులకు మద్దతుగా నిలిచామని, ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో చేసిందేమీ లేదంటూ సమర్ధించుకుంటోంది. టీఎన్జీఓ వ్యవహారంలో ఇప్పటికే పలు పార్టీలు టార్గెట్ చేస్తున్నట్లే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ కూడా జేఏసీపై ఆరోపణలు చేసింది. అయితే ఉద్యోగ సంఘాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావిస్తున్న నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలను ఇలా టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగ వర్గాల అంశంలో మంత్రి ప్రమేయం ఇంకా పెరుగుతోందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రకటనలు చేస్తూ ఉద్యోగులను ఆయోమయంలో పడేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు బీజేపీకి భార‌త్ బంద్‌ కార్యక్రమం దొరికింది.

రైతులతో మీకేం సంబంధం?

టీఎన్జీవో నాయకుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘‘టీఎన్జీవో నాయకులకు భార‌త్ బంద్‌ తో సంబంధం ఏంటి? ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నేతలు.. సీఎం కేసీఆర్‌ అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్‌, పీఆర్సీల గురించి మాట్లాడాల్సిన నాయకులు.. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారు. రుణమాఫీ, కనీస మద్దతు ధరపై ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించలేదు’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను బీజేపీ టార్గెట్ చేసిందనే ప్రచారం మరింత పెరిగింది.

ఉద్యోగులపై వేటు వేస్తే ఏం చేస్తున్నారు?

అటువైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన టీఎన్జీఓ, టీజీఓ సీనియర్ నేత, ఆ జిల్లా టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎంపీడీఓ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడంపై కూడా బీజేపీ టార్గెట్ చేసింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు మద్దతుగా ఉంటున్నాడని, ఆయనతో ట‌చ్‌లో ఉంటున్నాడనే కారణంగానే శ్రీనివాస్‌పై వేటు వేసినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీన్ని టీఎన్జీఓ కొట్టిపారేస్తోంది. శ్రీనివాస్ గతంలోనే టీఎన్జీఓ నుంచి వైదొలిగారని, సొంతంగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారని, అంతేకానీ టీఎన్జీఓతో సంబంధం లేదంటూ టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్ వెల్లడించారు. వేటు వేయడం అంతర్గతంగా ఉండే విషయాలని, దానిపై పార్టీలకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. అయినా దీనిపై శ్రీనివాస్… యూనియన్‌ను సంప్రదించలేదని, సంప్రదిస్తే చూస్తామని రాజేందర్ పేర్కొన్నారు.

ఉద్యోగుల సమస్యలు లేవా..?

భార‌త్ బంద్ అంశంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా టీఎన్జీఓపై విమర్శలకు దిగుతోంది. వాస్తవంగా ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం ఉద్యోగ వర్గాలకు ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం లేదంటున్నారు. కేవలం ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే కొన్ని పనులు చేస్తూ ఉద్యోగవర్గాలను మోసం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇటీవల టీజీఓ అధ్యక్షురాలు మమత భర్తకు రెండేండ్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడంతో పాటు ముగ్గురు, నలుగురితోనే ప్రగతిభ‌వ‌న్‌లో చర్చలు పెట్టడం, దీనికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయబారం చేయడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు సంధిస్తున్నాయి. కనీసం డీఏలు, కోత పెన్షన్‌ను ఒకే విడుతలో ఇప్పించుకోలేక చేతులెత్తేసిన ఉద్యోగ జేఏసీ ఇప్పుడు కేంద్రంపై నిరసనలకు ఎందుకు దిగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed