టీఆర్ఎస్‌కు అర్హత లేదు : బండి సంజయ్

by  |
bandi sanjay
X

దిశ, నాగర్ కర్నూల్: గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులను ఓట్లు అడిగే ధైర్యం కేసీఆర్‌కు లేకనే మంత్రులతో ప్రజలను బెదిరిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నాగర్‌కర్నూల్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల ఉసురు తీసిన సీఎం.. తన కుటుంబంలో రాజభోగాలు అనుభవిస్తూ ప్రత్యేక గడీలను నిర్మించుకున్నారని విమర్శించారు. దొర గడీలు బద్దలు కొడతామని, ఎవరికీ భయపడబోమని, ప్రాణాలైనా అర్పిస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టేనని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్స్ తీర్పు ఇక్కడికే పరిమితం కాదని నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్నారు. ఓట్లు అడిగే అర్హత టీఆర్ఎస్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను గాంధీతో పోల్చడం గాంధీకే అవమానకరమన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ తన కుటుంబం మాత్రమే బంగారుమయం మార్చకున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది రుజువైందన్నారు. ఎలాంటి ఎన్నికలు వచ్చినా డబ్బుతో ఓట్లు కొనొచ్చనే అహంకారంతో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఓటేసినవారు తెలంగాణ ద్రోహులని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పనులు నత్తను తలపిస్తున్నాయని విమర్శించారు. కుర్చీ వేసుకొని కూర్చొని పనులు పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు బంగారు శృతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, అసెంబ్లీ ఇన్‌చార్జి దిలీప్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed