బోజగుట్టలో 40 ఎకరాలు కబ్జా.. బండి సంజయ్ సంచలన ఆరోపణ

by  |
BJP chief Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 3వ రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్టానికి కేంద్రం కేటాయించిన ఆవాస్ యోజన ఇండ్ల లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టకుండా కేంద్రం నిధులను మళ్లించారని విమర్శించారు. బోజగుట్టలో ఇండ్లు కట్టిస్తామని పేదలను రోడ్డున పడేశారని ఆరోపించారు. బోజగుట్టలో ప్రజల 40 ఎకరాలు కబ్జా చేసి విల్లాలు, ఫంక్షన్ హాల్‌లు కడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ నాయకులు కలిసి పేదలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్బన్ ఏరియాలో కేవలం 8 వేల ఇండ్లను మాత్రమే కట్టారని తెలిపారు. ఆవాస్ యోజన పథకం కింద 2 లక్షల 3 వేల 80 ఇండ్లు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిందని, వీటిలో 1 లక్షా 40 వేల ఇండ్లకు కావల్సిన నిధులు వెంటనే విడుదల చేసిందని స్పష్టం చేశారు. ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతో వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. జీ‌హెచ్‌ఎంసీ, మున్సిపల్, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేంద్రం ఇచ్చిందని, వాటిని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వలన ఎంతోమంది ప్రాణాలు, డబ్బు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు.

Next Story