పాఠశాలల్లోని పెండింగ్ పనులు పూర్తి చేయాలి

by Sridhar Babu |
పాఠశాలల్లోని పెండింగ్ పనులు పూర్తి చేయాలి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపడుతున్న పనులను మే 31 తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి జిల్లా, మండల విద్యాశాఖ, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ఎంపికైన 1309 పాఠశాలల్లో పనులు ప్రారంభించడం జరిగిందని, అందులో 423 పాఠశాలల్లో పనులు ప్రారంభించి మే 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లో మౌలిక వసతులైన మంచి నీటి సౌకర్యం, టాయిలెట్స్ మరమ్మతులు, విద్యుత్తు పనులను చేపట్టాలన్నారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను మంజూరైన నిధుల ద్వారా పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. పనులన్నీ నాణ్యతగా ఉండాలని, ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతగా పని చేయాలని అన్నారు. అదేవిధంగా వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలు ఉంటే సరి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటిని ఎప్పటికప్పుడు

పర్యవేక్షిస్తూ వేగవంతంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు, వసతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలల్లో వసతులు చేపట్టడానికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, మండల స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed