రెండుగా విడిపోనున్న టీమ్ ఇండియా

by  |
రెండుగా విడిపోనున్న టీమ్ ఇండియా
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, బలమైన క్రికెట్ బోర్డు బీసీసీఐకి పెద్ద సవాలు ఎదురైంది. బీసీసీఐ చెప్పినట్లే ఐసీసీ ఆడుతున్నదని.. పలు క్రికెట్ బోర్డులు విమర్శలు చేస్తున్న సమయంలో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమ్ ఇండియా కారణంగా ఆసియా కప్ టీ20 ట్రోఫీ వాయిదా పడే ప్రమాదం ఏర్పడటంతో ఇప్పుడు జట్టును రెండుగా విభజించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇటు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రెండింటికీ తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన ముందు ఉన్నది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత జట్టు ఆ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఇందుకోసం సుదీర్ఘ కాలం ఇంగ్లాండ్‌లోనే గడపాలి. అదే సమయంలో ఆసియా కప్ టీ20 కూడా ఉండటంతో బీసీసీఐ జట్టును విభజించేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తున్నది.

Asia Cup

ఇదీ సమస్య..

టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను కూడా ఒక వారం ముందే ముగిస్తున్నారు. ఒక వేళ టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్లకుంటే జూన్ రెండవ వారంలో శ్రీలంక వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించారు. గత సెప్టెంబర్‌లోనే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. టీమ్ ఇండియా తప్పకుండా ఆడాలని భావించి పాకిస్తాన్ కూడా తమ ఆతిథ్యాన్ని శ్రీలంకకు ఇచ్చింది. దీంతో జూన్‌ 2021లో ఈ టోర్నీ నిర్వహించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడంతో ఆసియా కప్‌కు టీమ్ ఇండియా దూరం కావల్సి వస్తున్నది. జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్నది. ఆ తర్వాత రెండు వారాలకే ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్నది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమ్ ఇండియా లండన్‌లోనే ఉండిపోనున్నది. అందుకే శ్రీలంకకు మరో జట్టును పంపి ఆసియా కప్ ఆడించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తున్నది.

ఇలా చేద్దాం..

టీమ్ ఇండియా టెస్టు జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ టీ20లు కూడా ఆడుతుంటారు. డబ్ల్యూటీసీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో వీళ్లు తప్పకుండా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. దీంతో ఆసియా కప్ కోసం ఒక టీ20 జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తున్నది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీలతో పాటు యువ క్రికెటర్లు రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి, నటరాజన్, సూర్యకుమార్ యాదవ్‌లతో కూడిన జట్టును ఆసియా కప్‌కు పంపితే ఎలా ఉంటుందని బీసీసీఐ ఆలోచిస్తున్నది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జై షా టెస్టులు, టీ20 లకు వేర్వేరు జట్లు పంపడం వల్ల ప్రపంచ క్రికెట్‌కు సానుకూల సంకేతాలు పంపినట్ల ఉంటుందని.. ఇప్పటికే బీసీసీఐపై ఉన్న అపవాదులు కూడా తొలగిపోతాయని ఆయన అంటున్నారు. త్వరలోనే బీసీసీఐ సమావేశంలో రెండు జట్ల సిద్దాంతంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎప్పటి నుంచో..

వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్ల ఫార్ములాను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు ఎప్పటినుంచో అవలంభిస్తున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు మాత్రమే కాకుండా జట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ జరుగుతున్న సమయంలోనే టెస్టు మ్యాచ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇక ఇంగ్లాండ్ బోర్డు ఇటీవలే రొటేషన్ పద్దతిని తీసుకొని వచ్చింది. దీంతో ఆటగాళ్లకు విశ్రాంతి దొరకడమే కాకుండా.. తమకు ఇష్టమైన ఫార్మాట్‌లో ఆడే స్వేచ్ఛ ఉన్నది. కేవలం ఇండియా మాత్రమే అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ను కొనసాగిస్తున్నది. మరోవైపు జట్టు సభ్యులు కూడా దాదాపు అన్ని ఫార్మాట్లలో వాళ్లే ఉంటారు. దీని వల్ల ఐపీఎల్ జరిగే సమయంలో మరే విధమైన మ్యాచ్‌లు ఇండియాలో నిర్వహించడం లేదు. కాగా, ఇప్పుడు ఒకే దేశం వేర్వేరు జట్లు ఫార్ములా కనుక సక్సెస్ అయితే భవిష్యత్‌లో భారత జట్టు ఒకే సమయంలో రెండు సిరీస్‌ల ఆడినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Next Story

Most Viewed