ఆ శాఖ ఎవరి ప్రయోజనాల కోసం.. కార్పొరేటర్‌పై స్టే ఎత్తివేయరా..?

by  |
ఆ శాఖ ఎవరి ప్రయోజనాల కోసం.. కార్పొరేటర్‌పై స్టే ఎత్తివేయరా..?
X

దిశ, కరీంనగర్ సిటీ : ఎవరి పురోగతి ఆశించి రాష్ట్రంలో ఆ శాఖ ఏర్పాటైందో తెలీదు. కానీ వారికే పంగణామాలు పెడుతోంది. ఏ వర్గం అభ్యున్నతి కోసం పాటుపడేందుకు ఆ శాఖలో ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారో వారే ఆ వర్గ ప్రతినిధుల ఎదుగుదలను కాలరాస్తున్నారనే ఆరోపణలు నగరంలో వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన వర్గానికి చెందిన అధికారి మరో వర్గానికి కొమ్ము కాయటం పట్ల ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్పొరేటర్‌గా కొనసాగిస్తూ ఇచ్చిన స్టే గడువు ముగిసినా ఎత్తివేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక ఆంతర్యమెంటనే ప్రశ్నలు నగరంలోని బీసీ సామాజిక వర్గంలో ఉద్భవిస్తుండగా.. స్టే ఎత్తివేయించాలంటూ సోమవారం ఫిర్యాదుదారు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో, బల్దియాలోని 6వ డివిజన్ కార్పొరేటర్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు వారి దరికి చేర్చాల్సిన ఆ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు, బీసీల ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాకుండా ఆ కోటాలో పదవులు, పదోన్నతులు, రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోకుండా పై పెచ్చు వారిని వెనుకేసుకొస్తుండటం వెనుక దాగి ఉన్న మర్మం అంతుపట్టడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల కిందట జరిగిన బల్దియా ఎన్నికల్లో స్థానిక 6 వ డివిజన్ బీసీలకు కేటాయించారు. అయితే, ఓసీ అయిన కోల మాలతి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినట్లుగా ధ్రువీకరణ పత్రం పొంది అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీనిపై అదే డివిజన్‌కు చెందిన సాదవేని వినయ్ అనే యువకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సదరు కార్పొరేటర్ బీసీ కాదు ఓసీ అంటూ విచారణలో తేలగా, ఆమె పొందిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ మార్చి 17 న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చర్చించి, చర్యలు తీసుకునేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో కలెక్టర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ కార్పొరేటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంబంధిత కార్పరేటర్ మాలతి కోర్టుకెళ్లిన దృష్ట్యా జిల్లా కలెక్టర్ విడుదల చేసిన రద్దు ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టాలంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం ఆఘమేఘాల మీద గత నెల 1 న మెమో జారీ చేశారు.

దీంతో, తాత్కాలికంగా రద్దు ఉత్తర్వులు నిలిపివేశారు. అయితే, నిర్దిష్ట గడువు లోపల తన సామాజిక వర్గం నిరూపించుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. దీనిపై ఫిర్యాదు దారు పలుమార్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించలేదు. విధిలేక సోమవారం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తహసీల్దార్, జిల్లా కలెక్టర్, కార్పొరేటర్ మాలతి, రద్దు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ సూచించిన మంత్రిని కూడా ప్రతివాదులుగా చేర్చుతూ, పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 6వ డివిజన్ చర్చ నగరంలో మళ్ళీ మొదలైంది.

కలెక్టర్ నిర్ణయాన్ని లెక్కచేయకుండా..

జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా తూచ తప్పకుండా అమలుచేస్తుంది. దీన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఆశాఖ ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తుంది. కానీ, ఒక జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పక్కన పెట్టింది. కలెక్టర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టే ఇవ్వటమే కాక నిర్దిష్ట గడువులోపు సమాధానం కూడా ఇవ్వకున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

కలెక్టరేమో బీసీలకు న్యాయం చేసేందుకు పూనుకుంటే, బీసీ సంక్షేమ శాఖ మాత్రం బీసీలను కాదని ఓసీలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటుండటం వెనుక ఎవరి ప్రమేయం ఉంది. ఏమి ప్రయోజనాలు ఆశించి, ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందనే వ్యాఖ్యలు బీసీ సామాజికవర్గం నుంచి వస్తుండటం గమనార్హం.

case related pdf


Next Story

Most Viewed