కేసీఆర్‌ను వదిలిపెట్టం.. జైలుకెళ్లడం ఖాయం

by  |
కేసీఆర్‌ను వదిలిపెట్టం.. జైలుకెళ్లడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్‌కి వెళ్లాడని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేండ్ల నుంచి అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ మూడో టీఎంసీ నిర్మాణం ఎందుకోసం అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని, ఆరేండ్ల నుంచి కేసీఆర్‌ చెప్పేదొకటి, చేసేదొకటి అని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర నాయకుల వద్ద వంగి వంగి దండాలు పెట్టినా కేసీఆర్‌ను వదిలిపెట్టం.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం అన్నారు. రైతుల పోరాటానికి మద్దతిచ్చిన కేసీఆర్ ఆందోళన స్థలానికి ఎందుకు వెళ్లలేదని, రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కేవలం కేంద్రాన్ని అభాసుపాలు చేసేందుకే ఢిల్లీ పర్యటనకు వచ్చారని మండిపడ్డారు. రూ.20 వేల కోట్లను దోచుకునేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాత ప్రాజెక్టులకు డీపీఆర్‌లు అవసరం లేదని సీఎం చెబుతున్నారని.. డీపీఆర్‌లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల మేలు కోసమే సీఆర్ పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతేగాకుండా నిరుద్యోగుల కడుపుమంటలో కేసీఆర్ కాలిపోయే రోజులు దగ్గరకొచ్చాయని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చి కోర్టుల ద్వారా రద్దు చేసి.. చేతులు దులుపుకోవాలని చూస్తే.. నిరుద్యోగుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ మాయమాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందని అన్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వచ్చారో చెప్పాలని, ఢిల్లీలో ఎక్కడ యుద్ధం చేశారో తెలుపాలని అన్నారు. వరంగల్ కార్పొరేషన్‌కు కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రం నిధులు దారి మళ్లించారని విమర్శించారు.


Next Story