‘కరోనా కేసుల వివరాలు దాచిపెడుతున్నారు’

by  |
‘కరోనా కేసుల వివరాలు దాచిపెడుతున్నారు’
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం సంజయ్ సోషల్ మీడియా వేదికగా మీడియాతో మాట్లాడారు. కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ చర్యలు ఏమీ చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల విషయంలో ఐసీఎమ్మార్ జారీ చేసిన మార్గదర్శకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందన్నారు. ఇతర రాష్ట్రాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేసి కరోనావైరస్ కేసులు, మృతుల వివరాలు, గణాంకాలను వెల్లడిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఆ వివరాలను దాచిపెడుతోందని ఆరోపించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టులకు సైతం సరైన భద్రత లేకుండా పోయిందన్నారు. పాత్రికేయులకు సంబంధించిన ప్రత్యేక చర్యలపై దృష్టి సారించాలని కోరారు. కరోనాతో టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందిన తీరు అందరిని భయ భ్రాంతులకు గురిచేస్తుందని చెప్పారు.

Next Story

Most Viewed