రీల్ లైఫ్‌ యాక్టర్.. ఓఎల్‌ఎక్స్‌లో పెద్ద దొంగ

by  |
రీల్ లైఫ్‌ యాక్టర్.. ఓఎల్‌ఎక్స్‌లో పెద్ద దొంగ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అతడు చదివింది ఏడో తరగతే. కానీ వృత్తి యాక్టింగ్. చిన్ననాటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు. దీంతో ఏడో తరగతికే చదువు మానేశాడు. ప్రైవేట్ జాబులు చేసి చివరకు యూసుఫ్ గూడలో ఓ యాక్టింగ్ అకాడమీలో చేరాడు. ఆపై చిన్న చిన్న కారెక్టర్లు వేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా జై భీమ్ టీవీ అనే ఒక యూ ట్యూబ్ ఛానెల్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు చుంచు ప్రవీణ్ కుమార్. అయితే ఇదంతా నాణేనికి ఒక పక్క. అతడిలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అదే చోరీలు చేయడం. వృత్తి యాక్టింగ్ అయితే.. ప్రవృత్తి మాత్రం దొంగతనాలు. కెమెరా, లాప్ టాప్ వంటి కాస్ట్ లీ వస్తువులపైనే అతడి టార్గెట్ ఉంటుంది. కాస్ట్ లీ వస్తువులయితేనే భారీగా ధర ఉంటుందని వాటిపైనే ఫోకస్ చేసేవాడు. అలా ఓఎల్ ఎక్స్ లో కెమెరాలు అద్దెకు తీసుకునేవాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. పలువురు బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులకు చిక్కాడంతో అతడి ఆట కట్టించారు.

చుంచు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లోతుకుంట.. వెస్ట్ వెకటాపురం, దినకర్ నగర్ శ్రీ రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకున్నట్లు పంజాగుట్ట పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో కెమెరాలు ఎంత విలువైనవో ఇతరులు చెబుతుండగా విని వాటిని కొట్టేసేందుకు ప్లాన్ చేశాడని పోలీసులు చెప్పారు. అలా ఓఎల్ ఎక్స్ ద్వారా కెమెరాలను అద్దెకు తీసుకుంటానని ఆ కెమెరా ఓనర్లకు రిక్వెస్ట్ పెట్టేవాడు. వారి మధ్య డీల్ కుదిరాక డాక్యుమెంట్లు సమర్పించే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లను ఇచ్చేవాడని తెలిపారు. అంతేకాకుండా తనను తాను పది రకాల పేర్లతో పరిచయం చేసుకునేవాడు. కెమెరా అద్దెకు తీసుకున్న అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఆ అడ్రస్ కు వెళ్లినా తప్పుడు సమాచారం ఉండటంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దృష్టి సారించిన పోలీసులు బాధితుడి ఆట కట్టించారు. ఎట్టకేలకు అతడిని పట్టుకొని అతడి నుంచి 11 కెమెరాలు, ఒక లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కెమెరాలు, లాప్ టాప్ ను తిరిగి వాటి యజమానులకు అప్పగించారు. కాగా అపరిచిత వ్యక్తులకు అప్లికేషన్ల ద్వారా ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. ఈ కేసును ఛేదించిన పంజాగుట్ట డివిజన్ పోలీసులకు వెస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.


Next Story

Most Viewed