24 ఏళ్ల క్రితమే.. ఆన్‌లైన్ క్లాసెస్

by  |
archi comic
X

దిశ, ఫీచర్స్ : కరోనా వల్ల ఏడాది కాలంగా మనుషుల జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, విద్యార్థులు ఇంట్లో నుంచే పాఠాలు వింటున్నారు. ఈ క్రమంలో రిమోట్ లెర్నింగ్ (వర్క్‌ఫ్రమ్ హోమ్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, ఆన్‌లైన్ క్లాసెస్, లెస్సన్స్, ఈ-సర్టిఫికేషన్ కోర్సులు) సర్వసాధారణమైపోగా, దీనికి ప్రజలంతా అలవాటుపడిపోయారు. అయితే ‘కరోనా’ గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఏనాడో రాశాడని, నోస్ట్రడామస్ ఈ విపత్తు గురించి ముందే హెచ్చరించాడని చాలామందే చెప్పినా, వాటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే, విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉంటూ, పాఠాలు వింటారని ముందే అంచనా వేసిన అమెరికన్ ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్.. రెండు దశాబ్దాల క్రితమే(2021లో) కామిక్ స్ట్రిప్స్ రూపొందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

1939లో న్యూయార్క్‌లోని పెల్హామ్ నగరంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ‘ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్’ సంస్థ.. ఇప్పటివరకు ఎన్నో కామిక్ పుస్తకాలతో పాటు ఆండ్రూస్, జగ్హెడ్ జోన్స్, బెట్టీ కూపర్, వెరోనికా లాడ్జ్, రెగీ మాంటిల్, సబ్రినా స్పెల్మాన్, జోసీ, పుస్సీక్యాట్స్ వంటి కాల్పనిక క్యారెక్టర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఆర్చి సంస్థ 24 ఏళ్ల క్రితమే ఆన్‌లైన్ క్లాసులపై కామిక్ కార్టూన్ వేయగా, ఆ స్ట్రిప్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 1997లో ముద్రించిన ఆ కామిక్ స్ట్రిప్‌లో ఓ స్కూలు విద్యార్థి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా, ఆమె తల్లి వాచీ చూస్తూ.. స్కూలుకు టైమవుతుందని చెబుతుంది. అయితే ఇంకా 30 సెకన్ల టైముందని జవాబిస్తుంది కూతురు. ఈ మాట విన్న తండ్రి.. ఈ రోజుల్లో పిల్లలు అదృష్టవంతులు. పుస్తకాలు తీసుకెళ్లడం, వాతావరణం ఎలా ఉందనే విషయాలు పట్టించుకోనవసరం లేదంటాడు. ఆ పక్కనున్న చిత్రంలో కుమార్తె కంప్యూటర్ ముందు కూర్చుని, కెమెరా వైపు చూస్తూ చదువుకుంటూ ఉంటుంది.

కాగా గత ఏడాది నుంచి ఎంతోమంది విద్యార్థుల చదువులు ఇలానే ‘ఆన్‌లైన్’లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కామిక్ స్ట్రిప్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవడంతో, కార్టూన్ పూర్తి కథ ఎలా ఉందో తెలుసుకోవటానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తు్న్నారు. దీంతో ఆరు పేజీల కథ మొత్తాన్ని ఉచితంగా పొందగలిగే లింక్‌ను విడుదల చేసింది ఆర్చి కామిక్స్. ‘సరే, మాకు ఎగిరే కార్లు లేవు, కానీ ఇది నిజంగా నమ్మలేనటువంటి విషయం, ఇదంతా యాదృచ్ఛికమా లేదా టైమ్ ట్రావెల్‌లో ప్రయాణించారా’ అంటూ కార్టూన్‌పై నెటిజన్లు కామెంట్ చేశారు.

https://twitter.com/ArchieComics/status/1371927216922234886


Next Story