టీఎస్ సర్కార్‌పై ఫైర్ అవుతూ కేఆర్ఎంబీకీ లేఖ రాసిన AP

by  |
AP-TS Water Disputes
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగినప్పటికీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. అయితే, అదే సమయంలో కృష్ణా జ‌లాల‌ను 50:50 నిష్పత్తితో పంచాల‌ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సర్కార్ డిమాండ్‌పై కేఆర్ఎంబీ స్పందించింది.

కేసీఆర్ సర్కార్ ప్రతిపాదనపై అభిప్రాయం తెలపాలని జగన్ సర్కార్‌ను కేఆర్ఎంబీ ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని గుర్తు చేసింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని లేఖలో వెల్లడించింది.

ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సరికాదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. 2020-2021కి 70:30 నిష్పత్తితో నీటి పంప‌కాలు జ‌ర‌గాల‌ని ఏపీ కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంప‌కాలు ప్రాజెక్టు వారీగా చేయ‌లేద‌ని ఏపీ అభిప్రాయపడింది. శ్రీ‌శైలం నుంచి చెన్నైకు, సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు మాత్రం తాగునీటి స‌ర‌ఫ‌రాకు కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని లేఖలో కోరింది.

Next Story

Most Viewed