బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య.. కాల్చి చంపిన సహోద్యోగి

by Ramesh Naini |   (  Updated:2025-12-30 13:40:16  IST  )

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య.. కాల్చి చంపిన సహోద్యోగి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మైమెన్సింగ్ జిల్లాలోని సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బజేంద్ర బిస్వాస్ (40) అనే హిందూ కార్మికుడిని సహోద్యోగి నోమాన్ మియా కాల్చి చంపాడు. సోమవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మైమెన్సింగ్ పరిధిలోని మెహ్రబారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నోమాన్ మియా షాట్‌గన్‌ను బజేంద్ర బిస్వాస్ వైపు ఉంచి ‘కాల్చాలా?’ అని ప్రశ్నించిన అనంతరం కాల్పులు జరిపి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి నిందితుడు నోమాన్ మియాను అరెస్టు చేశారు.

ఘటనపై మైమెన్సింగ్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అబ్దుల్లా అల్ మమూన్ మాట్లాడుతూ, ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మోర్గ్‌కు తరలించామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని మీడియాకు తెలిపారు. మృతుడు బజేంద్ర బిస్వాస్ సిల్హెట్ సదర్ పరిధిలోని కాదిర్‌పూర్ గ్రామానికి చెందిన ప్రబిత్ర బిస్వాస్ కుమారుడిగా గుర్తించారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన నిరసనల నేపథ్యంలో హిందువులపై మూకల దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ హత్య మరింత కలకలం రేపుతోంది. ఈ ఘటనను బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ సైతం ధృవీకరించింది.

Next Story