మూగజీవులకు చెప్పరాని కష్టం..

by  |
మూగజీవులకు చెప్పరాని కష్టం..
X

మనుషులు ఎంత చెప్పినా వినట్లేదు.. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్న ఉద్దేశంతో లాక్‌డౌన్ నిబంధనలు సడలించారు. దీంతో జనాలేమో విచ్చలవిడిగా తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. కానీ హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. అటు కరోనా వైరస్, ఇటు ప్రభుత్వాల మధ్య యుద్ధంలో మూగజీవాలు బలవుతున్నాయి. అవును.. ఇప్పటికే వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో మందు, వ్యాక్సిన్ కనిపెట్టే పరీక్షలు ముమ్మరం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ కనిపెట్టగానే సరిపోదు కదా.. అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ముందు జంతువుల మీదే టెస్టు చేయాలి. ముందు వాటికి కరోనా వైరస్ ఎక్కించి, తర్వాత వాటి మీద వ్యాక్సిన్ గానీ, మందు గానీ టెస్టు చేయాలి. ఈ క్రమంలో శాంపిల్ సేకరణలో వందల కొద్దీ జంతువులు బలి అవుతున్నాయి.

అనుమతిచ్చిన మహారాష్ట్ర

దేశంలో కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రానికి వ్యాక్సిన్ అవసరం ఎక్కువ. కాబట్టి అక్కడి పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశోధకులు వ్యాక్సిన్ తయారీ కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. వారి వ్యాక్సిన్ పరీక్షల కోసం 30 రేసస్ కోతులను పట్టుకుని, వాటి మీద ప్రయోగాలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్‌ఐవీ వారి కోరిక మేరకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసున్న రేసస్ కోతులను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

భయం వల్ల మరికొన్ని..

టెస్టుల కోసం జంతువులను ఇబ్బంది పెట్టడం ఒక కోవకు చెందినదైతే, ఎక్కడ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందేమోనని వాటిని బంధించడం, చంపడం మరో రకం. నెదర్లాండ్స్ దేశంలో ఉన్ని కోసం పెంచే మింక్స్ జంతువులకు కొవిడ్ సోకిందని తేలింది. వాటి ద్వారా ఇద్దరు మనుషులకు కూడా వైరస్ పాకిందని స్పష్టమైంది. దీంతో ఆ దేశంలో పెంచుతున్న మొత్తం 10 వేల మింక్స్ జంతువులను బంధించి, ఐసోలేట్ చేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వైరస్ లక్షణాలు ఉన్న మింక్స్‌ను వీలైతే చంపేయాలని కూడా పరోక్ష ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

చైనా విధానం అద్భుతః

కరోనా వైరస్ పుట్టడానికి చైనీయులు అటవీ జంతువులు తినడమే ప్రధాన కారణమని ప్రపంచమంతా గగ్గోలు పెట్టింది. అయితే ఇప్పుడు ఆ అటవీ జంతువులను కాపాడటానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అటవీ జంతువులను అమ్మడం, తినడాన్ని ఆ దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా పాంగోలిన్స్ సంరక్షణ కోసం చైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతరించిపోతున్న ఈ పాంగోలిన్స్ జాతిని కాపాడటానికి చైనా ప్రయత్నిస్తోంది. అయితే కరోనా వైరస్ మొదట ఈ పాంగోలిన్స్ నుంచే మనుషులకు సోకినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వాటి అక్రమ అమ్మకాలు తగ్గలేదు. అందుకే ప్రత్యేకించి వాటి కోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed