సినిమా స్టైల్‌లో తొడగొట్టిన అనిల్ కుమార్.. సభలో గందరగోళం

by  |
సినిమా స్టైల్‌లో తొడగొట్టిన అనిల్ కుమార్.. సభలో గందరగోళం
X

దిశ, ఏపీ బ్యూరో: బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరావు, నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య వాగ్వాదం నెలకొంది. తమ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఒకరిని లేదా పార్టీని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు.

దీనిపై అనిల్ కుమార్ స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినప్పుడు, బీసీ అయితే అరెస్ట్‌ చేయకూడదా? అని ప్రశ్నించారు. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడిని అరెస్ట్‌ చేయడానికి వెళ్లారని గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలకు కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించినప్పుడు ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనిల్ కుమార్‌పై గతంలో వచ్చిన క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలను సంధించారు. దీనికి అనిల్ సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో తనకు నోటీసులిచ్చిప్పుడు ధైర్యంగా విచారణకు హాజరయ్యాననీ, విచారణలో క్లీన్‌చిట్ కూడా లభించిందని గుర్తుచేశారు. అలాగే, తనను ఓడించేందుకు టీడీపీ నేతలు భారీగా డబ్బులు పంచినప్పటికీ విజయం సాధించి సభలో అడుగుపెట్టానని చెబుతూ తొడగొట్టారు.

దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి వారి గడ్డాలను చూపిస్తూ రౌడీలంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి అనిల్ కుమార్ స్పందిస్తూ.. గడ్డం పెంచితే రౌడీలేనా? అని ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందనీ, వాళ్లు కూడా రౌడీలేనా? అంటూ కౌంటర్‌ అటాక్‌ చేశారు. దీంతో అక్రమ అరెస్టులు, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం లేదంటూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

Next Story