ఇలా ఇంకెన్నో ! ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించడానికి YCP పాట్లు

by Disha Web Desk 4 |
ఇలా ఇంకెన్నో !  ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించడానికి YCP పాట్లు
X

దిశ, ఏపీ బ్యూరో : గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు చోటుచేసుకున్న కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని ఎన్‌ఐఏ తేల్చిచెప్పింది. ఇప్పుడు సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఎవరు నిందితులు.. దీని వెనుక కుట్ర ఉందా లేక లేక సానుభూతి కోసం వైసీపీనే ప్లాన్​చేసిందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. జగన్‌పై రాయి దాడి అనంతరం చంద్రబాబుపై కూడా దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలు ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. కేవలం రెండు రోజుల్లోనే సమసిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకతను దారి మళ్లించడానికి సీఎం జగన్​ఏదో వ్యూహాన్ని అందుకోగానే వెంటనే దాన్ని ఎన్డీయే కూటమి అనుసరించడానికి సిద్దమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కప్పగంతులు కొత్త కాదు..

ఈ పద్దతి కొత్తేమీ కాదు. జగన్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింఛను పెంచుతామనగానే అప్పటి సీఎం చంద్రబాబు వెంటనే పెంచేశారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడతామనగానే తామే పెడతామంటూ చంద్రబాబు ముందుకొచ్చారు. నాటి ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి విభజన హామీలను ఎందుకు సాధించలేకపోయారంటే అందుకోసమే ఆ కూటమి నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఎన్డీయేతో ఎందుకు కలుస్తున్నారంటే వైసీపీని ఓడించడానికని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నట్లు పరిశీలకులు అంటున్నారు.

కాపీ స్కీములే..

చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు కాపీనే. అమ్మ ఒడి, 45 ఏళ్లు దాటిన ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ, కాపునేస్తంలాంటి పథకాలకే నెలవారీ రూ.1500 ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా సొమ్ము పెంచి అన్నదాతకు సాయంగా పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏటా మూడు గ్యాస్​ సిలిండర్లు పొరుగునున్న కాంగ్రెస్​ ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే. నిరుద్యోగ భృతి ఒక్కటే అదనంగా కనిపిస్తోంది. ఇవి తప్ప టీడీపీ తమదైన ముద్ర వేసుకునేట్లు అజెండాను ప్రజల ముందుకు ఇప్పటిదాకా తీసుకురాలేకపోయింది. రేపోమాపో సీఎం జగన్​ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత టీడీపీ కూటమి విడుదల చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ ఏమంటోంది..

టీడీపీ, జనసేన, వైసీపీ.. బీజేపీ పొదిలోని అస్త్రాలేనని కాంగ్రెస్,​ వామపక్షాలు దుయ్యబడుతున్నాయి. కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేస్తామని భరోసానిస్తున్నాయి. విశాఖ స్టీల్​ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామంటున్నాయి. పోలవరాన్ని వేగంగా ఓ కొలిక్కి తెస్తామని చెబుతున్నాయి. జీఎస్టీ ఎత్తేసి నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని హామీనిస్తున్నాయి. పంటల సాగుకు అయ్యే వ్యయాన్ని పారదర్శకంగా నిర్వచించి అందుకు రెండు రెట్లు అదనంగా కలిపి పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటిస్తామని రైతన్నలకు భరోసానిస్తున్నాయి. మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని కాంగ్రెస్,​ వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. పోలింగ్​ నాటికి ప్రజల మూడ్​ ఎలా మారుతుందనేది అంచనా వేయాలంటే మరికొంత సమయం పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.


Next Story