ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మహిళల ఆగ్రహం

by Thanuru Gopichand |

వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న అనంతపురం ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మహిళల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (MLA Daggubati Venkateswara Prasad) పై మహిళా లోకం మండిపడింది. ఇటీవల అతను ఓ మహిళను ఉద్దేశిస్తూ ఫోన్లో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (Andhra Pradesh Mahila Samakhya) ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. అనంతపురంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తమ అసహనాన్ని వ్యక్తపరించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అతని చిత్రపటానికి నిప్పంటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను, చట్టాలను తెచ్చారన్నారు. ఆస్తి హక్కును కూడా కల్పించడం జరిగిందన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసి టీడీపీ పాలనలో నేడు మహిళలకు భద్రత కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

అనంతపురం నగరంలోని సాయినగర్ లో ఆస్రా పేరుతో ఓ మహిళ ఆప్టికల్ షాప్ నిర్వహిస్తోందన్నారు. నిర్వాహకురాలికి, ఎమ్మెల్యే బావమరిదికి సంబంధించి భూవివాదం జరుగుతోందన్నారు. మహిళకు సంబంధించిన భూమిని కబ్జా చేసే యత్నం జరిగిందని ఆరోపించారు. ఈ వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారన్నారు. అంతేకాకుండా ఫోన్ కాల్ మాట్లాడుతూ అనరాని మాటలను అన్నారని చెప్పారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాల్ ఆడియో విన్న ప్రతిఒక్కరూ బాధ్యతగల ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలేనా అని అంటున్నారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story