Ap News: లంక భూముల్ని గుల్ల చేస్తున్నారు..

by Disha Web Desk 16 |
Ap News: లంక భూముల్ని గుల్ల చేస్తున్నారు..
X
  • రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు
  • యథేచ్ఛగా బొండు మట్టి తరలింపు
  • అధికార పార్టీ నేతల బరితెగింపు
  • కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
  • పర్యావరణానికి పెనుముప్పు
  • రైతుల భూముల్లోనూ తవ్వకాలు

దిశ, కొత్తపేట: అధికార పార్టీ నేతలు బరితెగించారు. లంకల్ని గుల్లచేసేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పగలురాత్రి నిరాటంకంగా బొండు, మట్టి తరలించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. అటువైపు కన్నెత్తి చూడడంలేదు. నిన్న మొన్నటి వరకు జగనన్న కాలనీల పూడిక పేరుతో అనుమతులు తెచ్చుకున్నారు. ఆ వంకతో బొండు, మట్టిని ప్రవేటు లే అవుట్లకు, ఇటుక బట్టీలకు తరలించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు బరితెగించారు. అసలు ఎటువంటి అనుమతులూ లేకుండానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు రావడం కాదు ప్రత్యేకంగా కనబడుతున్నాయి.

ఈ దోపిడీ ఎక్కడో మారు మూల ప్రాంతంలో అధికారుల కళ్ళు కప్పి చేయడంలేదు. రావులపాలెం-జొన్నాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే జొన్నాడ ఇసుక ర్యాంపు వద్ద యథేచ్ఛగా జేసీబీలను ఉపయోగించి వందలాది లారీలతో బొండు,మట్టి తరలించుకుపోవడం వారి అధికార దన్నును తెలియజేస్తోంది. ఇదంతా రావులపాలెంకు చెందిన ఒక అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే జరుగుతోందంటున్నారు.


గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తవ్వకాలు జరపాలంటే భూగర్భ జలవనరుల అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వకాలు జరుపుతున్నారు. అంతేకాదు భూగర్భ జలాలకు, పర్యావరణానికి పెను ముప్పు కలిగిస్తున్నారు. ఇలా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడం వల్ల వరదలు సమయంలో ఏటి గట్లు బలహీన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజుల నుంచి యథేచ్ఛగా పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు జరుపుతున్నా సంబంధిత అధికారులేవ్వరూ అటు వైపు కన్నెత్తి చూడటానికి బెంబేలెత్తపోతున్నారు. కాదుకూడదని అటువైపు చూస్తే ఆ అధికారి ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ ఉత్తర్వులు చూడాల్సిందే. ఈ అక్రమ తవ్వకాలపై తహశీల్దార్ కిషోర్ బాబుని కొంతమంది విలేకరులు వివరణ కోరితే తనకు ఏమీ తెలియదని తాను ఇన్ ఛార్జ్‌గా వచ్చి వారం రోజులే అయ్యిందని, అనుమతులు ఉన్నాయో..లేదో కనుక్కుని చెబుతానంటూ వెటకారంగా సమాధానం చెప్పారు.

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 'రాబోయే ఎన్నికల్లో 175కి 175 గెలవాలి. ప్రజల్లోకి వెళ్ళండి. మనం ఇచ్చినవి, చేసినవి వారికి వివరించి చెప్పండి' అంటూ... ఆదేశాలు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉన్న కొద్ది సమయంలోనే అవకాశం ఉన్నంతలో అందుబాటులో ఉన్న వనరులు దోసుకో...కోట్లు కూడబెట్టుకో అన్న రీతిలో కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా చిల్లుగవ్వకూడా లేకుండా పోయిందని, పార్టీ బోలెడంత పాడు చేసుకున్నామని కొత్తపేట నియోజకవర్గంలో వేలాదిమంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. కాని కొందరు నాయకులు మాత్రం మళ్ళీ అవకాశం వస్తుందో...రాదో...? అన్న రీతిలో అధికార అడ్డగోలుగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సొంతపార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారు.

మా భూముల్లో తవ్వేస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలి

ఈ అక్రమ తవ్వకాలు ప్రభుత్వ భూములతో పాటు మా సొంత భూముల్లో కూడా జరుగుతున్నాయని జొన్నాడ సర్పంచ్ ద్వారపూడి దొరబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం లేదా జనసేన పార్టీ నాయకుడు అవ్వడం వల్లే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపాడేయడానికి వీలు లేదు, ఆయన అధికార పార్టీ సీనియర్ నాయకులు. భూస్వామి, పారిశ్రామిక వేత్త కూడా. అయినప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే నాయకుడికే అక్రమ తవ్వకాల బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టమవుతుంది. ఇదే దారణమని మీడియా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు.


Next Story

Most Viewed