Eluru Collectorate వద్ద బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష

by Disha Web Desk 16 |
Eluru Collectorate వద్ద బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష
X

దిశ ఏలూరు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలపై కుటిల ప్రేమ చూపిస్తుందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. గతంలో ఉన్న పథకాలను రద్దు చేసి వాళ్ళ అభివృద్ధిని తుంగలోకి తొక్కారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పథకాలను పక్కదోవ పట్టించి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 26 ఎస్సీ పథకాలను అమలు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి 26 ఎస్సీ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మత్తి శ్రీనివాస శాస్త్రి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది.. ఈ నిరాహార దీక్ష మంగళవారం ఉదయం 10 గంటల వరకు జరగనుంది. ఈ నిరాహార దీక్షకు బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కొరళ్ళ జ్యోతి సుధాకర్ కృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గారపాటి చౌదరి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఖర్చు చేసిన నిధులు, లబ్ధిదారుల వివరాలతో కూడిన శ్వేత పత్రం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మత్తి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎస్సీలకు అందవలసిన కేంద్రం జారీ చేసే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క సబ్సిడీ రుణాన్ని కూడా ఎస్సీలకు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో బీజేపీ నాయకులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, బోరగం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story