నక్కలవారి కండ్రిగల పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం: సీపీఐ నారాయణ

by Bhoopathi Nagaiah |

ఏపీ ప్రభుత్వానికి సీపీఐ నారాయణ వార్నింగ్ ఇచ్చారు. నక్కలవారి కండ్రిగలలో పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

నక్కలవారి కండ్రిగల పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం: సీపీఐ నారాయణ
X

దిశ, గూడూరు : నక్కలవారి కండ్రిగ గ్రామంలో పేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన చిల్లకూరు మండలం రెట్టపల్లి పంచాయతీ నక్కలవారి కండ్రిగ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు నారాయణ దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి దిగకూడదని అధికారులు హుకుం జారీ చేశారని, కొంత మందిపై కేసులు కూడా పెట్టారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి ఆ భూముల్లో దుక్కిదున్నారు. తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భూమిపై అనుభవంలో ఉన్న పేద రైతులకు ఆ భూములను పంపిణీ చేయాలని తహసీల్దార్‌కు సూచించారు.

అనంతరం నారాయణ మాట్లాడుతూ నక్కలవారి కండ్రిగలో 50 ఏళ్లుగా గ్రామంలోని పేద రైతులు మిగులు భూములను సాగు చేసుకుంటున్నారని, అయితే ఆ భూముల్లోకి దిగకూడదని ఇటీవల అధికారులు హుకుం జారీ చేశారన్నారు. కొంతమందికి సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించి మరికొందరికి పై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. విషయం తెలుసుకుని స్వయంగా ట్రాక్టర్ తో భూములు దున్ని రైతులకు భరోసా కల్పించామన్నారు. నిజమైన లబ్ధిదారులకు అర ఎకరా వంతున భూ పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను కోరామన్నారు. శనివారం తహసీల్దార్ భూముల వద్దకొచ్చి పరిశీలించి అనుభవంలో ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారన్నారు. శనివారం వరకూ చూసి ఆ తర్వాత న్యాయం జరగని పక్షంలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి.శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు గోపాలయ్య, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కె.నారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి మీరా సాహెబ్, ఏఐఎస్ఎఫ్ గూడూరు పట్టణ కార్యదర్శి సయ్యద్ రిజ్వాన్, అన్వేష్, గ్రామ రైతులు ఉన్నారు.

Next Story