భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం : మంత్రి నారా లోకేశ్

by Thanuru Gopichand |

క్లీన్ ఎనర్జీ హబ్ గా అవతరించనున్న ఆంధ్రప్రదేశ్.

భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం : మంత్రి నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏసీఎంఈ (ACME) గ్రూప్ 400 మెగావాట్ల సోలార్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ పనులను చేపట్టింది. ప్రస్తుత దశలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా స్పందించారు. పనుల పురోగతిని తెలియజేసే చిత్రాలను నెటిజన్లతో పంచుకుంటూ అభినందనీయమైన పోస్టును చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా (Clean Energy Hub) తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. అనంతపురం జిల్లాలో ఏసీఎంఈ (ACME) గ్రూప్ చేపట్టిన 400 మెగావాట్ల సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు పనుల్లో కనిపిస్తున్న వేగం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. పనులు జరుగుతున్న తీరు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లభించిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలోకి రావడం విశేషమన్నారు. సుమారు రూ.3,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

​ఈ ప్రాజెక్టు ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి కావడమే కాకుండా, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ వల్ల గ్రిడ్ స్థిరత్వం పెరుగుతుందన్నారు. తద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలపాలన్న విజన్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఇలాంటి మరిన్ని భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.

Next Story