తప్పుడు రాతలు రాస్తే ఆఫీస్‌లు తగలబెడతాం: ఆర్కే రోజా మాస్ వార్నింగ్

by Ramesh Naini |

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతిలో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు.

తప్పుడు రాతలు రాస్తే ఆఫీస్‌లు తగలబెడతాం: ఆర్కే రోజా మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతిలో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిజం ముసుగులో ఆయన చంద్రబాబుకు బ్రోకర్‌గా వ్యవహరిస్తూ వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులపై, మహిళలపై పిచ్చి కూతలు కూస్తూ.. తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని, ఆంధ్రజ్యోతి ఆఫీసులను తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము సంస్కారంతో ఆగుతున్నామని, తిట్టడం మొదలుపెడితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మంత్రులు రోడ్లపై తిరగలేరని స్పష్టం చేశారు.

రాయలసీమ ద్రోహి చంద్రబాబు..

సీఎం చంద్రబాబు రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని రోజా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ఆయన, అమరావతికి మాత్రం రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. 87 శాతం పూర్తయిన రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేయడం ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేనని, దీని పూర్తి కోసం మహా ఉద్యమం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

Next Story