56 రోజులు నాన్‌స్టాప్‌.. రెండింతలైన సినిమా కష్టాలు.. ఓట్ల వేటలో అభ్యర్థులు

by Disha Web Desk 18 |
56 రోజులు నాన్‌స్టాప్‌.. రెండింతలైన సినిమా కష్టాలు.. ఓట్ల వేటలో అభ్యర్థులు
X

దిశ ప్రతినిధి, విజయవాడ: డామిట్ కథ అడ్డం తిరిగింది. మార్చి ఆఖర్లో నోటిఫికేషన్, ఏప్రిల్‌ రెండోవారంలోనే ఎన్నికలు అని లోపల్లోపల లెక్కలేసుకుని చంకలు చర్చుకున్న లీడర్లంతా ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నారు. దయచేసి మరో రెండు నెలలు వేచి ఉండండి అంటూ ఈసీ చెప్పిన ఆ చల్లటి కబురు అభ్యర్థుల్ని కుళ్లబొడుస్తోంది. ఇంటికెళ్లి సౌండ్ రాకుండా కుమిలికుమిలి ఏడుస్తున్నారు నేతాశ్రీలు. రక్త కన్నీరొక్కటే తక్కువ అక్కడ. మే 13న ఎన్నికలు జూన్‌ 4న కౌంటింగ్ అని ఎలక్షన్ షెడ్యూల్ వచ్చీరాగానే తెలుగురాష్ట్రాల్లో మిక్స్‌డ్‌ ఫీలింగ్స్.మొదట్లో ఎగిరి గంతులేశారు లీడర్లు.ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే వచ్చెనుగ..అంటూ ఆ కాసేపూ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మొహాలొకరు చూసుకుని తెల్లమొహాలేశారు. కారణం పోలింగ్‌ కోసం మరో 56 రోజుల సుదీర్ఘకాలం వెయిట్ చెయ్యాల్సి రావడం. ఇవాళ్టితో మొదలుపెడితే దాదాపు రెండు నెలల పాటు ఓటర్ల చుట్టూ చక్కర్లు కొట్టే తీరాలి. కనబడ్డ చోటల్లా చేతులెత్తి మొక్కాలి.అదొక తియ్యటి నరకం..! ఎవరికీ చెప్పుకోలేని కనాకష్టం.

నిన్నమొన్నటిదాకా టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికే కొన్ని చోట్ల ఏ పార్టీ పోటీ చేస్తుందన్న క్లారిటీ లేదు. ఎలాగోలా బీఫారం తెచ్చుకుని నెల, నెలన్నరలో చావో రేవో తేల్చుకుందామనుకుంటే.ఇప్పుడు రెండునెలల పోరాటం. తప్పనిసరై పోయింది. కొందరైతే నియోజకవర్గంలో తాయిలాల పంపకం కూడా షురూ చేసుకున్నారు. గిఫ్ట్ బాక్సులు పంచిపెట్టిన వాళ్లంతా ఓటర్లు తమ గుప్పిట్లోనే ఉన్నారన్న భరోసాతో గడుపుతున్నారు. కానీ మళ్లీ మనసు మార్చుకుని చేజారిపోకుండా, మరో పార్టీ వైపు చూడకుండా తటస్థ ఓటర్లను కంటికి రెప్పలా మే 13 దాకా కాపాడుకుంటూ రావాలి. వీలునుబట్టి ఓటర్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. హతవిధీ… ఎంత కష్టం.. ఎంత కష్టం..? అధిష్టానం అవస్థలు కూడా తక్కువేమీ లేవు. ఊరూరా తిరిగి ప్రచారం చేసుకోవడానికి కావల్సినంత టైమ్ దొరికిందని సంబరపడిపోవాలా.. 56 రోజుల పాటు ఈ పోరాటం నాన్‌స్టాప్‌గా చేయాల్సిందేనని వేదన చెందాలా?

16 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ, 14 అసెంబ్లీ, 2 లోక్‌ సభ స్థానాల్లో జనసేన ఇంకా అభ్యర్థుల్నే ప్రకటించలేదు. తెలంగాణలో కూడా జాబితాల కసరత్తు అసంపూర్ణంగానే ఉంది. క్యాండిడేట్లు పేర్లు ఖరారు చేయడం ఒక ఎత్తయితే.. వాళ్లతో నియోజకవర్గాల వారీగా ఎదురయ్యే అసమ్మతుల్ని చల్లార్చడం ఇంకో ఎత్తు. 2019లో నోటిఫికేషన్ వెలువడగానే తొలి దశలోనే ఏప్రిల్ 16న పోలింగ్ జరిగింది. పెద్ద గ్యాపేమీ రాలేదు.ఒక్కొక్క ఓటరు నీ దాదాపు రెండు నెలల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అత్యంత ఓపికతో కూడిన విషయం.పైగా చాలా ఖరీదైన వ్యవహారం. అంచనా కంటే మించి మరికొన్ని నోట్ల కట్టలు బయటికి తియ్యాలి. ప్రచారంలో ఖర్చు పెట్టాలి. కార్యకర్తల్ని మేపాలి. అవసరాన్ని బట్టి ఓటర్ల మీద కుమ్మరించాలి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది కనుక, దుఃఖాన్నంతా కడుపు లోపలే దాచుకుంటున్నాయి పార్టీలు.

Next Story

Most Viewed