సాల్వో ఎక్స్ ప్లోజివ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి

by Disha Web Desk 23 |
సాల్వో ఎక్స్ ప్లోజివ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి
X

దిశ,మేడ్చల్ బ్యూరో : చిన్నపాటి ఘటనకే హడావిడి చేసే అధికార యంత్రాంగం భారీ పేలుడు సంభవించిన అలసత్వం ప్రదర్శించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా, కీసర మండలం, అంకిరెడ్డిపల్లి గ్రామంలో సాల్వో ఎక్స్ ప్లోజివ్ కంపెనీ ఉంది. ఈ నెల 29వ తేదీన సోమవారం మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ప్రమాదంలో అందులో పనిచేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురి కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.అయితే ఇంత పెద్ద సంఘటన జరిగిన వివరాలను పోలీసులు, రెవెన్యూ, కార్మిక తదితర విభాగాలు గోప్యంగా ఉంచడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గోప్యతపై అనుమానాలు..

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామం సాల్వొ ఎక్స్ ప్లోజివ్ కెమికల్ కంపెనీలో భారీ పేలుడు జరిగి 24 గంటలు గడుస్తున్నా.. స్థానిక పోలీసులు కనీసం సుమోటోగా ఆ కంపెనీ యాజమాన్యం పై కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పేలుడులో ఓ కార్మికుడు (బీహార్ వాసి) తునా తునకలై దుర్మరణం చెందడం, ఆ భవనం పూర్తిగా ధ్వంసమై అక్కడి పలువురికి తీవ్ర గాయాలు అయినప్పటికీ అధికార యంత్రాంగం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పంచనామా చేయాల్సిన కీసర తహసీల్దార్, రెవెన్యూ బృందంను, ఉన్నత పోలీస్ అధికారిని వివరణ కై మీడియా సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఎప్పుడు జరిగిందని వారు తిరిగి ప్రశ్నించడం గమనార్హం. సాల్వో ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నో ఎంట్రీ..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ సాల్వో ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో మైనింగ్ సంబంధించి కెమికల్స్, జిలేటిన్ స్టిక్స్ తయారీ జరుగుతుంది. వందల ఎకరాల్లో ఉన్న ఈ కంపెనీలోకి ఎవరికైనా నో.... ఎంట్రీ అనే చెప్పుకోవాలి. కంపెనీలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు, గోదాముల నిర్మాణాలు జరుపుతూ అందులో అంతా గుట్టుగా జరుపుతున్నారు. వాటిలో ప్రమాదకరమైన కెమికల్స్ స్టిక్ వంటి పేలుడు పదార్థాల తయారీ వాటి నిల్వ ఉంచుతున్న సాల్వొ కంపెనీ యాజమాన్యం అందులోని కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వారి బతుకులతో చెలగాటం ఆడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారణ జరుపుతున్నాయి : మహేష్, ఏసీపీ కుషాయిగూడ

భారీ పేలుళ్లపై విచారణ జరుపుతున్నాయి. సాల్వో కంపెనీలో భారీ పేలుళ్లు జరిగిన మాట వాస్తవమే.. మంగళవారం ఉదయం వెళ్లి విచారణ జరిపాం. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించాం. అయితే బిల్డింగ్ మొత్తం కూలీపోయింది. కంపెనీలో పనిచేసే సోనీ అనే వ్యక్తి కనిపించడంలేదని కంపెనీ నిర్వహకులు చెబుతున్నారు. అక్కడ మాత్రం మృతుని అనవాళ్లు కన్పించడంలేదు. మనిషి శరీరభాగాలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పొరెన్సీక్ నిపుణులను రంగంలోకి దింపాం.. వారు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే అదృశ్యమైన బంధువు కీసర పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story

Most Viewed