ఐదో దశలో 49 నియోజకవర్గాలకు పోలింగ్.. కీలక అభ్యర్థులు వీరే

by Gopi |
ఐదో దశలో 49 నియోజకవర్గాలకు పోలింగ్.. కీలక అభ్యర్థులు వీరే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు పూర్వగా, ఈ నెల 20న ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోని 14 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంసమైన అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు సైతం ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. ఈసారి మొత్తం 695 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. ఐదో దశలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమబెంగాల్‌లో 7, ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఐదో దశ ఎన్నికల్లో బరిలో ఉన్న కీలక అభ్యర్థులు..

1. రాహుల్ గాంధీ (రాయ్‌బరేలీ, యూపీ): రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. 2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. వయనాడ్ ఎంపీ స్థానానికి రెండవ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసింది. రాహుల్ గాంధీపై పోటీగా బీజేపీ యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌ నిలిచారు.

2. స్మృతి ఇరానీ (అమేఠీ, యూపీ): 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అనూహ్య విజయం సాధించి, అమేఠీ స్థానాన్ని గాంధీ కుటుంబానికి దూరం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అమేఠీ ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఆయన గాంధీ కుటుంబానికి చాలాకాలంగా విధేయుడు. 2014లో రాహుల్ గాంధీ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయి, 2019లో దాదాపు 55,000 ఓట్ల భారీ తేడాతో గెలుపొందిన తర్వాత అమేఠీ నుంచి స్మృతీ ఇరానీకి ఇది మూడో ఎన్నికలు. రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు మూడుసార్లు అమేఠీ ఎంపీగా ఉన్నారు.

3. రాజ్‌నాథ్ సింగ్ (లక్నో, యూపీ): ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాతో రాజ్‌నాథ్ సింగ్ తలపడనున్నారు. 2019లో రాజ్‌నాథ్ సింగ్ దాదాపు మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఎస్పీకి చెందిన పూనమ్ శత్రుఘ్న సిన్హాపై విజయం సాధించారు.

4. కరణ్ భూషణ్ సింగ్ (కైసర్‌గంజ్, యూపీ): బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కైసర్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌గా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను తప్పించి ఆ స్థానంలో ఆయన కుమారుడికి బీజేపీ బాధ్యతలు అప్పగించింది. కరణ్ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, గోండా జిల్లాలోని సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. అతను డబుల్ ట్రాప్ షూటింగ్‌లో నేషనల్ ప్లేయర్ కూడా. ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ, లా డిగ్రీని కలిగి ఉన్నాడు.

5. రోహిణి ఆచార్య (శరణ్, బీహార్): ఆర్జేడీ నేత, పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి శరణ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ బంధువుపై తిరుగులేని విజయాలు సాధించిన బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీపై ఆమె పోటీ చేస్తున్నారు. 2014లో మాజీ సీఎం రబ్రీ దేవిపై విజయం సాధించిన ఆయన, 2019 ఎన్నికల్లో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రికా రాయ్‌పై విజయం సాధించారు.

6. చిరాగ్ పాశ్వాన్ (హాజీపూర్, బీహార్): లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఐదవ దశలో మరో కీలక అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఆర్జేడీ చంద్ర రామ్‌పై పోటీ చేస్తున్నారు. 2014లో దివంగత రాంవిలాస్ పాశ్వాన్ హాజీపూర్ స్థానం నుంచి గెలుపొందగా, 2019లో ఆ పార్టీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ 5 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

7. పీయూష్ గోయల్ (ముంబై నార్త్): కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పీయూష్ కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై పోటీ చేస్తున్నారు.

8. అరవింద్ సావంత్ (ముంబై సౌత్, మహారాష్ట్ర): మహా వికాస్ అఘాడి ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన, శివసేన యూబీటీ నేత అరవింద్ సావంత్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం బైకుల్లా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం షిండే నేతృత్వంలోని శివసేన నేత యామినీ జాదవ్‌పై ఆయన పోటీ చేస్తున్నారు.

Next Story

Most Viewed