కమలంలో కల్లోలం... Daggubati Purandeshwariకి ఇంటిపోరు

by Disha Web Desk 21 |
కమలంలో కల్లోలం... Daggubati Purandeshwariకి ఇంటిపోరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు కుమార్తెగా ఆమెకు మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీ తన తండ్రి స్థాపించిన పార్టీ అయినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు పర్యాయాలు ఏకంగా కేంద్రమంత్రిగా పనిచేశారు. యావత్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరారు. బీజేపీలో పలు హోదాలలో పనిచేసిన ఆమె ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ దగ్గుబాటి పురంధేశ్వరి. పురంధేశ్వరి తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గుబాటి పురంధేశ్వరిపై యుద్ధానికి కాలుదువ్వుతోంది. అంతేకాదు చంద్రబాబుతో బంధుత్వం కూడా పురంధేశ్వరికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతుంది. వీటన్నింటిని ధీటుగా ఎదుర్కొంటున్న పురంధేశ్వరికి తాజాగా ఇంటిపోరు మెుదలైంది. సొంత పార్టీలోని కొందరు నేతలు ఆమెపై కయ్యానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వంతపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే బీజేపీ అధిష్టానానికి పురంధేశ్వరిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి ఈ కమలం పార్టీలో ఈ కల్లోలకం కలకలం సృష్టిస్తున్నాయి.

బయటపడ్డ విబేధాలు

ఏపీ బీజేపీలో విబేధాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపైనే పలువురు నేతలు బాహటంగా విమర్శలకు దిగుతున్నారు. పురంధేశ్వరి బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు దగ్గుబాటి పురంధేశ్వరి కమలం పార్టీలో ఉన్న టీడీపీ కోవర్టు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ అధ్యక్షులుగా ఎంతోమందితో పనిచేసిన సీనియర్ నేత డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి.. దగ్గుబాటి పురంధేశ్వరిపై విరుచుకుపడటం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేస్తున్నారో లేక టీడీపీ జెండాను మోస్తున్నారో తనతోపాటు పార్టీలోని నేతలకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి నేటి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని...కేవలం సొంత ప్రయోజనాల కోసమే రాజకీయం చేస్తున్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. త్వరలోనే బీజేపీని టీడీపీకి తాకట్టుపెడతారంటూ బాంబు పేల్చారు. ఎన్నికల వరకు అయినా పురంధేశ్వరి బీజేపీలో ఉంటారో లేక ఏ పార్టీ పదవి ఇస్తుందని తెలిస్తే ఆ పార్టీలోకి పురందేశ్వరి జంప్ అయిపోతారో తమకు అర్థం కావడం లేదని బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

చంద్రబాబు కోసం పనిచేస్తారా?

తెలుగుదేశం పార్టీతో బీజేపీకి సత్సంబంధాలు లేవని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే అవినీతి ఆరోపణలతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే పురంధేశ్వరి తొలుత స్పందించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సొంత పార్టీ కోసం పనిచేయడం మానేసి టీడీపీని కాపాడుకునే బాధ్యతను పురంధేశ్వరి తన భుజాలపై వేసుకున్నారని ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అంతేకాదు పురంధేశ్వరి ఏపీలో ఇసుక స్కాం, మద్యం స్కాం వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి అనంతరం సైలెంట్ అయిపోవడంపై అనేక అనుమానాలకు కలుగుతున్నాయని ఆరోపించారు.ఈ స్కాంలను బయటపెట్టకుండా ఉండేందుకు ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు పురంధేశ్వరికి కలిగాయా అనే అనుమానాలు కలుగుతున్నాయని మండిపడ్డారు. అంతేకాదు బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె పార్టీ పదవులను సైతం అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీకి డ్యామేజ్ కలిగేలా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మరికొందరి నాయకులతో కలిసి త్వరలోనే ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు పురంధేశ్వరి వైఖరిపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

అధిగమిస్తారా?

ఇదిలా ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం దగ్గుబాటి పురంధేశ్వరిని టార్గెట్ చేస్తోంది. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ అంశాలతోపాటు వ్యక్తిగతంగానూ విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ విమర్శలకు ఎలా కౌంటర్ ఇచ్చుకోవాలని భావిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతల నుంచి నేతల తిరుగుబాటు ఎదురుకావడం ఆమెకు మింగుడుపడటం లేదు. కొందరు నేతలు స్వపక్షంలో విపక్షంగా మారడం.. ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని బాహటంగా ప్రకటనలు చేస్తుండటాన్ని ఆమె తట్టుకోలేకపోతున్నారు. తాను టీడీపీ సానుభూతిపరురాలిని అంటూ ముద్ర వేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు కోసం పురంధేశ్వరి ఎందుకు పనిచేస్తారని ఆమె తరఫు నేతలు వాదిస్తున్నారు. చంద్రబాబు మరిది కాబట్టి.. కావాలనే బురద జల్లి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా వైసీపీ నేత విజయసాయిరెడ్డి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మెుత్తానికి పురంధేశ్వరికి అటు సొంత పార్టీ మరోవైపు అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలు పెద్ద సవాల్‌గా మారింది. మరి వీటన్నింటిని పురంధేశ్వరి ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.

Next Story